Best Web Hosting Provider In India 2024
Devara vs NBK 109: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీపై పాన్ ఇండియా రేంజ్‍లో క్రేజ్ ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావటంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లితో ఓ మూవీ (NBK 109) చేస్తున్నారు. గతేడాది దసరా సీజన్‍లో భగవంత్ కేసరితో బ్లాక్‍బస్టర్ కొట్టి ఫుల్ జోష్‍లో ఉన్నారు బాలయ్య. దీంతో ఈ ఏడాది కూడా బాలకృష్ణ మూవీని దసరాకే తీసుకురావాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. దీంతో బాక్సాఫీస్ వద్ద బాబాయి బాలయ్య, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలివే..
దేవర వర్సెస్ ఎన్‍బీకే 109 ఇలా..
ఈ ఏడాది ఏప్రిల్‍లో రిలీజ్ కావాల్సిన దేవర వాయిదా పడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఆ దిశగా షూటింగ్ కూడా సాగుతోంది. అయితే, బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‍లో తెరకెక్కుతున్న మూవీని కూడా అక్టోబర్ 10నే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
దీంతో అక్టోబర్ 10న బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి సినిమాల పోటీ ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఎన్‍బీకే 109 మూవీ రిలీజ్ డేట్‍ను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే టైటిల్ రివీల్‍తో ఓ వీడియో తీసుకొచ్చే ప్లాన్‍లో ఉన్నారట. ఆ సమయంలో విడుదల తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందనే అంచనాలు ఉన్నాయి. మరి, బాక్సాఫీస్ వద్ద బాలయ్య, ఎన్టీఆర్ క్లాష్ ఉంటుందేమో చూడాలి.
దేవర రిలీజ్ డేట్ మార్పుపై బజ్
దేవర రిలీజ్ డేట్ మారుతుందంటూ కూడా ఇటీవల కొన్ని రూమర్లు వచ్చాయి. అక్టోబర్ 10 కంటే ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు టాక్ వచ్చింది. సెప్టెంబర్ చివరి వారం లేకపోతే అక్టోబర్ తొలి వారమే ఈ మూవీని రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రం వాయిదా పడితే సెప్టెంబర్ 27వ తేదీన దేవర రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే అక్టోబర్ 10న ఎన్‍బీకే 109 వచ్చినా.. బాబాయి, అబ్బాయి పోటీ ఉండదు.
దేవర సినిమా నుంచి ఫియర్ అంటూ ఫస్ట్ సాంగ్ వచ్చేందుకు రెడీ అయింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు రేపు (మే 20) ఉండగా.. ఒక్క రోజు ముందే నేడు (మే 19) ఈ పాట రానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఈ పాటపై ఫుల్ క్రేజ్ ఉంది. నేటి సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఈ సాంగ్ రిలీజ్ కానుంది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో కీరోల్స్ చేస్తున్నారు.
ఎన్‍బీకే 109 చిత్రంలో బాలకృష్ణకు జోడీగా ఊర్వశి రౌతేలా నటిస్తున్నారు. బాబీ డియోల్, చాందినీ చౌదరి కీలకపాత్రలు చేస్తున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లు నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు.