Best Web Hosting Provider In India 2024

అమరావతి: అసైన్డ్ ల్యాండ్స్పై ఎటువంటి విధానాలు అమలవుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటైన అసైన్డ్ ల్యాండ్స్ కమిటీ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తోంది. సోమవారం తమిళనాడు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో చెన్నైలోని ప్రధాన సచివాలయంలో ఏపీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో ఎటువంటి విధానాలు అమలు చేస్తున్నారో ఆరా తీశారు.ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలకుమేలు జరిగేలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అసైన్డ్ భూముల విషయంలో వ్యవహరించాలన్నది లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు భూముల బదలాయింపుపై ప్రభుత్వానికి మెరుగైన సిఫారసులు చేసేందుకు తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు చెప్పారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కూడా ఆరు విడతలుగా జరిగిన భూ పంపిణీ కార్యక్రమానికి కూడా తానే నేతృత్వం వహించినట్లు చెప్పారు. వ్యవసాయ భూమి ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మవిశ్వాసం అసైన్డ్భూములను వారికి కూడా కలిగించేలా వైయస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో మాదిరిగా గ్రామాల్లో పెత్తందార్లు పేద వర్గాల వారి నుంచి భూములు లాక్కునేందుకు వీల్లేదన్నారు. ప్రభుత్వం అసైన్మెంట్ దారులు పేద, మధ్య తరగతుల వారికి బహుళ ప్రయోజనాలు చేకూర్చే విధంగా కమిటీ సూచనలు సలహాలు ఇవ్వాలని సిఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని మంత్రి ధర్మాన తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కమిటీ పర్యటించి పలు సూచనలు, సలహాలు , అభిప్రాయాలు సీఎం వైయస్ జగన్కు నివేదిక రూపంలో అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో తమిళనాడు రెవెన్యూ మినిస్టర్ రామచంద్రన్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రెవెన్యూ మరియు ఇతర రెవెన్యూ అధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి అడిషనల్ సిసిఎల్ఏ ఇంతియాజ్, సిసిఎల్ఏ జాయింట్ సెక్రెటరీ గణేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.