Best Web Hosting Provider In India 2024
Raveena Tandon: బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్‍పై దాడి జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఆమెను కొందరు ముట్టడించారు. మహిళలపై రవీనా టాండన్ దాడి చేశారని, తిట్టారని ఆరోపిస్తూ అక్కడి వారు ఆమెను చుట్టుముట్టారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. తనను కొట్టొద్దంటూ అక్కడి వారిని రవీనా వేడుకోవడం కూడా ఈ వీడియోలో ఉంది.
ర్యాష్ డ్రైవ్ చేశారని..
ముంబైలోని రిజ్వీ లా కాలేజీ సమీపంలో రవీనా కారు డ్రైవర్ వేగంగా నడిపాడని అక్కడి వారు ఆరోపించారు. డ్రైవర్‌ను ప్రశ్నిస్తుంటే.. రవీనా కిందకు దిగారని చెబుతున్నారు. డ్రైవర్‌కు మద్దతుగా మాట్లాడి.. తన తల్లిని రవీనా కొట్టారని ఓ వ్యక్తి ఆరోపించారు. మద్యం మత్తులో ఆమె దాడి చేశారని చెప్పారు. తన తల్లికి తీవ్ర గాయమైందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే, రవీనా టాండన్ ప్రయాణిస్తున్న కారు ఎవరికీ తాకలేదని తెలుస్తోంది. ఈ ఆరోపణలపై లాయర్లను కూడా ఇప్పటికే ఆమె సంప్రదించారని సమాచారం. అయితే, గొడవకు సంబంధించిన పూర్తి స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.
కొట్టొద్దండి
అక్కడి స్థానికులు రవీనా టాండన్‍ను చుట్టుముట్టినట్టు వీడియోలో తెలుస్తోంది. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో “నా ముక్కులో నుంచి రక్తం వస్తోంది. ఆమె (రవీనా) నాపై దాడి చేశారు” అంటూ ఓ మహిళ అంటున్నట్టు ఆ వీడియోలో రికార్డ్ అయింది.
‘తోయకండి.. నన్ను కొట్టకండి” అని అక్కడి వారిని రవీనా వేడుకున్నారు. వీడియోలు తీయవద్దని ఆమె కోరారు. ఆమెను (రవీనా)ను కొట్టాలంటూ కొందరు అరిచినట్టు కూడా వీడియోలో రికార్డు అయింది.
మోహిసిన్ షేక్ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. అక్కడి స్థానికులు ఖార్ పోలీస్ స్టేషన్‍కు వెళ్లారు. రవీనా టాండన్ భర్త, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తదానీ కూడా స్టేషన్‍కు వెళ్లినట్టు సమాచారం.
బాలీవుడ్‍లో సుమారు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నారు రవీనా టాండన్. చాలా కాలం స్టార్ హీరోయిన్‍గా వెలుగొందారు. కొంతకాలంగా మహిళా ప్రధానమైన సినిమాలు, సపోర్టింగ్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు. కేజీఎఫ్-2 చిత్రంలో రమికా సేన్ పాత్రతో దక్షిణాదిలోనూ చాలా పాపులర్ అయ్యారు రవీనా. తెలుగులోనూ బంగారు బుల్లోడు సహా మరో రెండు చిత్రాల్లో కనిపించారు.
రవీనా టాండన్ ప్రధాన పాత్ర పోషించిన పాట్నా శుక్లా చిత్రం ఈ ఏడాది మార్చిలో నేరుగా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీలో లాయర్ తన్వీ శుక్లా పాత్రను ఆమె చేశారు. ఈ చిత్రానికి వివేక్ బుదాకోటి దర్శకత్వం వహించారు. అర్బాజ్ ఖాన్ నిర్మించిన ఈ మూవీకి కరణ్ కులకర్ణి సంగీతం అందించారు. ప్రస్తుతం అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో వెల్‍కమ్ టు ది జంగిల్ మూవీ చేస్తున్నారు రవీనా. గుడ్చాదీ చిత్రం కూడా ఆమె లైనప్‍లో ఉంది.