
Best Web Hosting Provider In India 2024

Mulugu LandmineBlast: ములుగు అడవుల్లో మందుపాతర పేలి ఓ అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకో ఇద్దరు స్వల్పంగా గాయపడగా.. అనూహ్య ఘటనతో ఏజెన్సీ ఏరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా ఈ ఘటనపై ములుగు జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. మావోయిస్టులకు సహకరించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురానికి చెందిన ఇల్లందుల ఏసు, రమేష్, ఫకీరు అనే ముగ్గురు వ్యక్తులు సమీపంలోని కొంగలగుట్టపైకి సోమవారం ఉదయం కట్టెల కోసం వెళ్లారు. కాగా ఇదివరకే మావోయిస్టులు ఆ ప్రాంతంలో పోలీసులను హతమార్చేందుకు గుట్టపై మందుపాతర పెట్టి ఉంచగా.. కట్టెల కోసం అటు ఇటు నడుస్తున్న క్రమంలో ఏసు దానిపై కాలేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ మందుపాతర భారీ శబ్దం లో పేలిపోయింది.
ఈ ప్రమాదంలో ఏసు అక్కడికక్కడే కుప్పకూలగా.. తీవ్ర రక్త శ్రావం జరిగి స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వెంట వచ్చిన రమేష్, ఫకీరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీపంలోని ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ఒక దశలో ఎన్ కౌంటర్ జరుగుతుందేమోనని జనాల్లో భయాందోళన వ్యక్తం అయింది. ఇదిలావుంటే శబ్దం విన్న సమీప గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. అనంతరం అటుగా వెళ్లి చూడగా.. ఏసు చనిపోయి ఉన్నాడు. మిగతా ఇద్దరు గాయాలతో రోదిస్తూ కనిపించారు.
పరామర్శించిన ములుగు ఎస్పీ
మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి చనిపోయిన ఇల్లందుల ఏసు కుటుంబాన్ని ములుగు జిల్లా శబరీష్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అందవలసిన ఎక్స్ గ్రెషీయా, నష్ట పరిహారాన్ని త్వరగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దహన సంస్కార కార్యక్రమాల కోసం కొంత నగదు అందజేశారు. గాయాల పాలైన మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను కోరారు.
దుశ్చర్యలకు సహకరిస్తే సీరియస్ యాక్షన్: ఎస్పీ శబరీష్
దుశ్చర్యలకు పాల్పడుతున్న సీపీఐ మావోయిస్టులు, వారికి సహకరించే సానుభూతి పరులు, మిలీషియా సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. వాజేడు మండలం కొంగలగట్టు మందుపాతర పేలుడు ఘటనపై సోమవారం సాయంత్రం ఆయన స్పందించారు.
మావోయిస్ట్ ల మందు పాతరలకి అమాయక వ్యక్తి బలి కావడం బాధాకరమన్నారు. ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో ప్రాబల్యం కోల్పోయిందని, మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదని స్పష్టం చేశారు. మావోయిస్ట్ నాయకులు తమ స్వప్రయోజల కోసం అమాయక పేద ప్రజల ప్రాణాలు బలికొంటున్నారని మండిపడ్డారు. మావోయిస్ట్ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి సాధారణ ప్రజలు రోజువారీగా తిరిగే ప్రదేశాల్లో మందు పాతరలు పెడుతున్నారన్నారు.
అందులో భాగంగానే ఇల్లెందుల ఏసు అనే అమాయక వ్యక్తి ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. రెండు రోజుల కింద జరిగిన మందు పాతర పేలుడు ఘటనలో ఓ పెంపుడు కుక్క బలి అయ్యిందని గుర్తు చేశారు. మావోయిస్టు కార్యకలాపాలు, పార్టీ దుశ్చర్యలకు అమాయక ఆదివాసి గిరిజన, పేద ప్రజలతో పాటు వారి పెంపుడు జంతులు కూడా బలైపోతున్నాయని, అలాంటి వారికి సహకరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
టాపిక్