AP Deputations Issue: డిప్యుటేషన్‌ అధికారుల్లో దడ, ఆటో రిలీవ్ కోసం తంటాలు, ప్రభుత్వం అనుమతిస్తోందో లేదోనని ఉత్కంఠ

Best Web Hosting Provider In India 2024

AP Deputations Issue: ఏపీలో ఐదేళ్లుగా కీలక పదవుల్లో ఉన్న అధికారుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. అధికార పార్టీ అండదండలతో అడ్డగోలుగా వ్యవహరించిన వారంతా తమను రాష్ట్రం నుంచి రిలీవ్ చేయాలని దరఖాస్తు చేస్తున్నారు. కొందరు డిప్యూటేషన్ గడువు ముగియగానే వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. వీరి విషయంలో టీడీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది.

ఏపీకి ఐదేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి రాగానే కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులు డెప్యుటేషన్ పై వచ్చారు. వారికి కేంద్రం అనుమతించిన ఐదేళ్ళ గరిష్ట గడువు త్వరలో ముగియనుంది. ఇలా డెప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

డెప్యూటేషనుపై వచ్చిన అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో వారిని వెంటనే రిలీవ్ చేయకూడదని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

మాతృ సంస్థకు వెళ్తానంటూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ సీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి అభ్యర్థించారు. బాధ్యతల నుంచి రీలీవ్ చేయాల్సిందిగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి సిఎస్‌కు దరఖాస్తు చేశారు. తనను మాతృ శాఖకు సరెండర్‌ చేయాల్సిందిగా ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సిఎస్‌ను కోరారు.

ఏపీ నుంచి రీలీవ్ చేయాల్సిందిగా ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి సైతం దరఖాస్తులు పంపారు. గతంలో డెప్యూటేషనుపై వచ్చిన అధికారులపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఏపీ నుంచి తెలంగాణాకు వెళ్లేందుకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ దరఖాస్తు చేసుకున్నారు. రావత్ తో పాటు తెలంగాణాకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారుల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

ఐదేళ్లుగా ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు పదవుల నుంచి తప్పుకుంటే అప్పట్లో జరిగిన అక్రమాలు ఎప్పటికి బయటకు రావని టీడీపీ భావిస్తోంది. దీంతో డెప్యూటేషన్ అధికారులు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈఓ ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకున్నా, ధర్మారెడ్డి సెలవును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సెలవు ప్రతిపాదనల్ని సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.

ఆటో రిలీవ్ అయిపోతామంటున్న అధికారులు…

రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న అధికారుల్లో కొంతమంది వైసీపీ అధ్యక్షుడు సూచనతో డెప్యూటేషన్ పొడిగింపు దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్ల గడువు ముగిసిన వారు తక్షణం మాతృ సంస్థలకు వచ్చేయాలని, ఒక్క రోజు కూడా పొడిగింపు ఉండదని మినిస్ట్రీ ఆఫ్‌ పర్సనల్, గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్‌ మార్చి 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ వెలువడటానికి ముందే డెప్యూటేషన్లపై రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న వారంతా వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. గడువులోగా వెనక్కి రాకపోతే పెన్షన్లలో కోత విధిస్తామని హెచ్చరించింది. నిర్ణీత గడువులోగా వారంతా ఆటో రిలీవ్ అయిపోతారని స్పష్టం చేసింది.

ఏపీలో విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర సర్వీస్ అధికారులు తమ గడువు ముగియగానే ఆటో రిలీవ్ అయిపోతామని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో కొందరు అధికారులు ఎక్స్‌టెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నీ పిఎంఓలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాటిలో ఎలాంటి కదలిక రాలేదు.

తాజా ఫలితాల నేపథ్యంలో ఆ అభ్యర్థనలకు అమోదం లభించే అవకాశం లేదు. దీంతో మాతృ సంస్థలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీరి విషయంలో ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పదవీ కాలం ముగిసినా జగన్ ప్రత్యేక అభ్యర్థనతో గడువు పొడిగించారు.

ఆర్థిక శాఖలో అన్నీ తానై చక్రం తిప్పిన కేవీవీ సత్యనారాయణ రాష్ట్రానికి వచ్చి ఏడేళ్లు అవుతోంది. గతంలో చంద్రబాబు, ప్రస్తుతం జగన్ ప్రభుత్వాల్లో ఆర్థిక శాఖను నడిపించాడు. కేవీవీ సత్యనారాయణ ఎన్నికలకు ముందే మాతృ సంస్థకు వెళ్లిపోయేందుకు సిద్ధమైనా ప్రభుత్వం ఆయన్ని బలవంతంగా కొనసాగించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు నిబంధనలు ఉల్లంఘించిన అధికారులంతా ఎన్నికల ఫలితాలపై ఆందోళనతో రాష్ట్రాన్ని విడిచిపెట్టేందుకు రెడీ అయినా సిఎంఓ బలవంతంగా వారిని ఒప్పించింది.

సిఎస్‌పైనే అందరి దృష్టి….

ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించడానికి సిఎస్ జవహార్‌ రెడ్డే కారణమని సిఎం చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కలవడానికి వచ్చిన జవహార్ రెడ్డితో చంద్రబాబు అంటిముట్టనట్టు వ్యవహరించారు. వీలైనంత త్వరగా పదవి నుంచి తప్పుకోవాలని సిఎస్‌కు టీడీపీ సందేశం పంపినట్టు తెలుస్తోంది.

టీడీపీపై జరిగిన కక్ష సాధింపు వ్యవహారాలు, ఆర్ధిక అక్రమాలు, బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు, వైసీపీకి అన్ని విధాలుగా సహకరించడంలో సిఎస్ జవహర్ రెడ్డి స‍హాయ సహకారాలు అందించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల కోడ్‌ రావడానికి ముందు నుంచి సిఎస్‌ను తప్పించాలని డిమాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీలో అదృశ్య శక్తులు ఆశీస్సులు అందించడంతో పదవికి ఎలాంటి గండం లేకుండా గడిచిపోయింది.

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రాజకీయంగా టీడీపీ నష్టపోయేలా నిర్ణయాలు తీసుకున్నారని, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం వరకు సిఎస్ కొనసాగుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

సిట్‌ కార్యాలయానికి తాళాలు…

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గత ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాల ఆధారాలను ధ్వంసం చేయకుండా చూడాలని జిఏడి ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కార్యాలయం నుంచి స్పష్టమైన సూచనలు అందడంతో జిఏడి చర్యలు చేపట్టింది. రాష్ట్ర సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపై నిఘా పెంచాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆదేశించారు.

దీంతో జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ సురేశ్‌ కుమార్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు.. కార్యదర్శులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు లక్ష్యంగా కక్ష సాధింపులకు ఉపయోగించిన తాడేపల్లిలో సిఐడి సిట్‌ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డిని అన్ని ప్రభుత్వ పదవుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు.

సిట్‌ కార్యాలయానికి తాళాలు వేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అడిషనల్‌ కమాండెంట్‌ బెటాలియన్స్‌ ప్రకాశ్‌ నేతృత్వంలోని బృందం సిట్ ఆఫీసుకు తాళాలు వేశారు. సిట్‌ డీఎస్పీ ధనుంజయ్‌ మొదట సీజ్ చేసేందుకు ఒప్పుకోలేదు. డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా నేరుగా జోక్యం చేసుకోవడంతో సిట్ ఆఫీసును సీజ్ చేశారు.

ఏపీఎస్పీ పోలీసులను కాపలా ఉంచారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన ‘సిట్‌’ చీఫ్‌ కొల్లి రఘురామి రెడ్డి తక్షణమే పోస్టులన్నీ వదిలేసి హెడ్‌ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేశారు. గత ప్రభుత్వంలో రఘురామిరెడ్డి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, సిట్‌ అధిపతిగా ఏకకాలంలో పనిచేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Ap PoliticsTdpYsrcpChandrababu NaiduAndhra Pradesh NewsGovernment Of Andhra Pradesh
Source / Credits

Best Web Hosting Provider In India 2024