Best Web Hosting Provider In India 2024
AP Hindu Temples: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ భారీ విజయాన్ని సాధించడంతో దేవాలయాల పాలకమండళ్లను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే పలువురు ఆశావహులు నామినేటెడ్ పదవుల కోసం గెలిచిన అభ్యర్థుల వద్దకు క్యూ కడుతున్నారు. వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలకమైన పోస్టులతో పాటు దేవాలయాల పాలక మండళ్లను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఏపీలో వైసీపీ ఓటమి పాలవడంతో టీటీడీ పాలకమండలికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు.రాష్ట్రంలో గ్రేడ్ 1 దేవాలయాలైన శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ ఆలయం, అన్నవరం, సింహాచలం, కాణిపాకం వంటి ఆలయాల పాలకమండళ్లకు ప్రత్యేక మైన గుర్తింపు ఉంది.
టీడీపీ అధికారంలోకి రావడంతో పాత పాలక మండళ్లను రద్దు చేస్తారని కొత్త వారికి అవకాశం కల్పిస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దేవాలయాల పాలక మండళ్లకు పలువురి పేర్లను కూడా సోషల్ మీడియాలో ప్రచారంలోకి తీసుకొచ్చారు.
దేవాలయాల పాలక మండళ్లకు కొత్త ఛైర్మన్ల పేరుతో ప్రచారంలోకి వచ్చిన పేర్లు చర్చనీయాంశంగా మారాయి. గత ఐదేళ్లలో దేవాలయాల పాలక మండలి ఛైర్మన్లతో పాటు సభ్యుల నియామకం వివాదాస్పదంగా మారింది. దళారులు, నేరచరితులు, క్రిమినల్ కేసులు ఉన్నవారు, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, బుకీలు, కాల్ మనీ వ్యాపారులు, వ్యభిచారం కేసుల్లో నిందితులు వంటి వారితో పాలక మండళ్లను నింపేశారనే అపప్రద ఉంది.
ముఖ్యమైన దేవాలయాలను ఆదాయ మార్గాలుగా భావించి స్థానిక నేతలు వాటిని తమ చెప్పు చేతల్లో ఉండే వారిని వాటికి ఛైర్మన్లుగా, పాలక మండలి సభ్యులుగా నియమించారు. దీంతో ఆలయాల్లో దర్శనాలు మొదలుకుని, ప్రసాదాల వరకు అందినకాడికి దోచేశారు. దేవాలయాల్లో భక్తి సంగతి అటుంచితే అధ్మాత్మిక లేకుండా చేశారు. విజయవాడ దుర్గ గుడి వంటి చోట బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు మొత్తాన్ని అభివృద్ధి పనుల పేరుతో కరిగించేశారు.
విజయవాడ దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాంబాబు ఏకంగా దేవాదాయ శాఖ మంత్రికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి ఆశీస్సులతో ఆ శాఖ మంత్రిని దుర్గగుడిలో అడుగడుగున అడ్డు తగులుతూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలను అయా జిల్లాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమ గుప్పెట్లో పెట్టుకుని దేవుడి సొమ్మును యథేచ్ఛగా దోచేశారు.
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆవురావురమంటూ ఎదురు చూస్తోన్న దళారులు ఆ పోస్టుల్లో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్ళు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థుల వెంట ప్రచారం చేసిన వారిలో కొందరు ఆలయాలపై కన్నేశారు. పాలకమండలి ఛైర్మన్ల పోస్టుల కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే తిరుమలలో దర్శనాలతో కొందరు నేతలు కోట్ల రుపాయలు సంపాదించారనే అపవాదును గత ప్రభుత్వం మూటగట్టుకుంది. ఇలాంటి వాటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై ఉంది.
ఇలాంటి వారిలో గుళ్లో చెప్పుల దొంగలు మొదలుకుని ఇత్తడి సామాగ్రి దొంగలు, ప్రసాదాల దొంగలు, కాల్ మనీ వ్యాపారులు, రౌడీ షీటర్లు, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, ఆలయాల్లో వ్యాపారాలు చేసేవారు, గుళ్ల వద్ద కొబ్బరి కాయలు, ముక్కల చీరలు అమ్ముకునే వారి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. రాజకీయ కారణాలతో ఇలాంటి వారందరికి పదవుల్ని కట్టబెడితే వైసీపీకి పట్టిన గతే టీడీపీకి కూడా పడుతుందనే వాదన ఉంది. దేవాలయాల పవిత్రతను కాపాడటంలో అప్రమత్తంగా లేకపోతే దేవుళ్ల శాపాలతో పాటు భక్తుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్