Best Web Hosting Provider In India 2024
Friday Motivation: ఒక వ్యక్తి విజయం సాధించాలంటే వృత్తి గతంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా జీవితాన్ని జయించాలి. కొంతమంది డబ్బు సంపాదిస్తే జీవితంలో ఎదిగినట్టేనని ఫీల్ అవుతారు. డబ్బు సంపాదన మాత్రమే విజయం అనుకుంటే పొరపాటే. మీ జీవితంలో ఎదురైనా అనుబంధాలను, స్నేహాలను కాపాడుకుంటూ… వాటిని వీలైతే మెరుగుపరచుకుంటూ వెళ్లడమే అసలైన విజయం. వృత్తిగత విజయాన్ని సాధించి వ్యక్తిగతంగా అనుబంధాలను నష్టపోతే మీ విజయం పరిపూర్ణం కాదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా అనుబంధాలను వృద్ధిపరుచుకుంటూ వెళితేనే మీది సంపూర్ణ విజయం.
వృత్తిగతంగా విజయం సాధించాలని ప్రయత్నం చేస్తూ ఎంతోమంది తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను కోల్పోతారు. వారితో అనుబంధాన్ని కొనసాగించలేక విడిపోతారు. ఇది వారి జీవితంలో ఒక లోటుగానే మిగిలిపోతుంది. మీ వృత్తిగత విజయాలలో వారిని కూడా భాగస్వాములను చేసుకోండి. అప్పుడు వారితో కూడా అనుబంధం పెరుగుతుంది. మీ విజయంలో వారికి కొంత భాగాన్ని ఇవ్వండి.
కొన్ని బంధాలు పుట్టుకతోనే ఏర్పడతాయి. తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అన్నదమ్ములు, పెదనాన్నలు, పెద్దమ్మలు… ఈ బంధుత్వాలన్నీ మన పుట్టుకతో సహజంగా వచ్చేవి. మనిషి పెరిగే కొద్దీ, డబ్బు సంపాదించే కొద్దీ ఆ యాతనలో పడి ఎన్నో అనుబంధాలను వదిలేస్తారు. బంధుమిత్రులు లేని డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీ విజయాన్ని పొగడడానికైనా మీ చుట్టూ నలుగురు బంధువులు ఉండాలి. కాబట్టి మీరు వృత్తి గతంగా ఎదగడమే కాదు, వ్యక్తిగతంగా కూడా మీ బంధుమిత్రులను చేరువ చేసుకోండి.
బంధాలను తెంచుకోవడం వల్ల వచ్చేది అనర్ధాలే. కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. మన పురాణాల్లో వాలిసుగ్రీవులు ఇద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు. చిన్న అనుమానాలతో ఇద్దరూ సోదర బంధానికి దూరమయ్యారు. చివరికి ఒకరు మరణించి, ఒకరు మాత్రమే మిగిలారు. అలాగే రావణుడు తన తమ్ముడైన విభీషణుడు మాట వినక తన ప్రాణానికే కాదు, తన దేశానికే చేటు చేశాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఇతర రక్త సంబంధీకులు మీ విజయంలో పాలుపంచుకోవడం వల్ల మీకు పని మరింత సులభతరం అవుతుంది. మీరు ఒక్కరే ఎదగాలని అనుకోకండి… మీతో పాటు మీ వారందరూ ఎదగాలని అనుకోండి.
మీ పుట్టుకతో పాటు దేవుడు మీకు ఇచ్చిన అన్ని రక్త సంబంధాలను గౌరవించండి. వారికి మీ ఆత్మీయతను అందించండి. మీ జీవితం మరింత అందంగా మారుతుంది.