Best Web Hosting Provider In India 2024

Eenadu Ramoji Rao Passes Away: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. అతి సామాన్య జీవితం నుంచి అత్యంత శక్తివంతుడిగా, అక్షరయోధుడిగా సాగిన జీవిత ప్రయాణాన్ని నెమరవేసుకుంటున్నారు.
రామోజీరావు అక్షర యోధుడు – చంద్రబాబు
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు.
అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని…కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు.
రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు…దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని కొనియాడారు. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని అన్నారు. రామోజీరావుతో తనుకు ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.
రామోజీ రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను స్మరించుకున్నారు.
ఆ జ్ఞాపకాలు మరవలేను – జూనియర్ ఎన్టీఆర్
రామోజీ రావు మృతిపై హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. “శ్రీరామోజీ గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
రామోజీ రావు మరణంపై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సీని ప్రముఖులే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన్ను అభిమానించే చాలా మంది సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
రామోజీరావు(87) ఇవాళ ఉదయం అస్తమించారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4. 50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలిస్తున్నారు.
*
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్