Best Web Hosting Provider In India 2024
AP ADCET 2024 Cancelled : రాష్ట్రంలో ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ADCET 2024)ను రద్దు చేశారు. మెరిట్ ఆధారంగానే నేరుగా ప్రవేశాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే నిర్వహించిన ఏడీసెట్ ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రమైన కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సి ఉన్న ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏడీసెట్)-2024ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏడీసెట్-2024 ఛైర్మన్ ప్రొఫెసర్ బానోతు ఆంజనేయప్రసాద్, కన్వీనర్ ప్రొఫెసర్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
విద్యార్థులందరికీ మేలు చేసేలా
డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సుల్లో భాగంగా పెయింటింగ్, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, బి.డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చారు. కొన్ని విభాగాల్లో ఆశించిన మేర దరఖాస్తులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏడీసెట్-24ని రద్దు చేశారు. డైరెక్ట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
పదిరోజుల్లోపు ప్రక్రియ స్టార్ట్
ఈ విషయాన్ని ఏపీ ఉన్నత విద్యా మండలి దృష్టికి ఏడీసెట్ నిర్వహకులు తీసుకెళ్లారు. దీంతో ఏడీసెట్-24ని రద్దు చేసేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతించింది. దీంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ వారి అర్హత మార్కులు (ఇంటర్/డిప్లొమా), రోస్టర్, మెరిట్ ఆధారంగా నేరుగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ను వచ్చేవారంలో విడుదల చేస్తారు. అనంతరం పదిరోజుల్లోపు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఏడీసెట్-25కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికావల్సిన పనిలేదని ఏడీసెట్ నిర్వహకులు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థికి సంబంధిత సమాచారాన్ని ఫోన్ ద్వారా, పత్రికల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్