Best Web Hosting Provider In India 2024
Mega DSC : మెగా డీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై మొదటి సంతకం ఎప్పుడు చేస్తారని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా మొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేస్తారు. చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తారని అందరూ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసే యోచనలో విద్యాశాఖ ఉంది. దాని స్థానంలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకువిద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే చేయనున్నట్లు ఇప్పటికే అధికార వర్గాలకు సమాచారం అందింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందించారు.
13 నుంచి 15 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్!
బుధవారమే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో విద్యా శాఖ అప్రమత్తమైంది. ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ లో 6,100 పోస్టులు ఉన్నాయి. అయితే తాజాగా 13 నుండి 15 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాత నోటిఫికేషన్ లో పోస్టులు
పాత నోటిఫికేషన్ లో 6,100 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్జీటీ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టీజీటీ పోస్టులు 1,264, పీజీటీ, ప్రిన్సిపాల్ పోస్టులు 215 ఉన్నాయి. వీటికి సుమారు 3.30 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు జరగలేదు. ఎన్నికల కోడ్ పూర్తి అయిన తరువాత పరీక్షలు నిర్వహించాలని ఈసీ పేర్కొనడంతో డీఎస్సీ పరీక్షలకు బ్రేక్ పడింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను కూడా నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,67,559 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ వల్ల పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు. దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఏపీలో 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జులైలో లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2023 జులై 31న లోక్‌సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి సమాధానం ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 20021-22లో 38,191 ఉపాధ్యాయ పోస్టులు, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్