Best Web Hosting Provider In India 2024
Monday Motivation: వయసు పెరుగుతున్న కొద్దీ మానసిక దృఢత్వం తగ్గుతూ ఉంటుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముసలివారు అయిపోతున్నామనే భావన మీ మెదడుకి గానీ, మీ మనసుకు గానీ రానివ్వకూడదు. మనసును ఎంత యవ్వనంగా ఉంచుకుంటే శరీరం అంతే ఉత్సాహంతో పనిచేస్తుంది. శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే మనసు, మెదడుకు కూడా వ్యాయామం అవసరం. కొన్ని రకాల పనులు చేయడం ద్వారా మనసు యవ్వనంగా ఉంచుకోవచ్చు. మెదడులో వచ్చే వృద్ధాప్య ఆలోచనలు రాకుండా అడ్డుకోవచ్చు
ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. అరగంట పాటు నడిస్తే మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది. కొత్త న్యూరాన్ల పెరుగుదల జరుగుతుంది. అభిజ్ఞా విధులు చక్కగా జరుగుతాయి. దీనివల్ల మతిమరుపు వంటి వ్యాధులు రావు. వారంలో ప్రతిరోజూ నడవడం, సైక్లింగ్ వంటివి చేయడం వల్ల మీ మెదడు నిత్య నూతనంగా పనిచేస్తూ ఉంటుంది.
మెదడు ఎంత చక్కగా ఆలోచిస్తే మనసు కూడా మెదడు మాటే వింటుంది. మెదడు, మనసు ఒకటయ్యాక శరీరం అవి చెప్పిన మాట వినాల్సిందే. మనం తినే ఆహారం మెదడు ఆరోగ్యం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడు కోసం పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తింటూ ఉండాలి. లీన్ ప్రోటీన్ తో కూడిన ఆహారాల్లో తినాలి. ఆలివ్ నూనె, నట్స్, సీడ్స్ వంటివి తినడం వల్ల అల్జీమర్స్ వచ్చే వ్యాధి తగ్గుతుంది.
శరీరంలాగే మెదడు కూడా అలసిపోతుంది. ఉదయం నుంచి శారీరక విధులను ఆజ్ఞాపిస్తూ, ఆలోచిస్తూ ఇది అలసటకు గురవుతుంది. కాబట్టి దీనికి కూడా కొంత విశ్రాంతి అవసరం. మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. నిద్రలోనే కాబట్టి రోజులో 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోండి. ఆ సమయంలోనే మెదడు కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. లేకుంటే మతిమరుపు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. వృద్ధాప్యం బారిన పడుతున్న వారు ఖచ్చితంగా మెదడు కోసం కొన్ని అలవాట్లను చేసుకోవాల్సిందే. అప్పుడే మీ వయసుకు వృద్ధాప్యం వస్తున్నా మీ మనసుకు మాత్రం వృద్ధాప్యం ఉండదు. యవ్వనంగానే ఉంటారు.
వయసు పెరుగుతున్న కొద్దీ చాలామంది చేసే పని… ఏ పనీ చేయకపోవడం. మెదడుకు ఉదయం పూట ఎన్ని పనులు చెబితే అది అంత పదునుదేరుతుంది. కాబట్టి పజిల్స్ సాధించడం, ఏదైనా కొత్త పుస్తకాలు చదవడం, కొత్త భాష నేర్చుకోవడం, సంగీత వాయిద్యాలు వాయించడం వంటి పనులు చేయండి. మీ మనసు ఉత్తేజ పడుతుంది. నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. దీనివల్ల మీ మనసు యవ్వనంగా ఉంటుంది.
వృద్ధాప్యం బారిన పడినంత మాత్రాన సమాజానికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ వయసు వారితో మీరు చక్కగా స్నేహబంధాలను పాటించండి. స్నేహితులు, కుటుంబం కమ్యూనిటీతో కలిసిపోండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మతిమరుపు రావడం తగ్గుతుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలు కూడా ఇదే తేలింది. ఫోన్ కాల్స్‌లో మాట్లాడడం, చాట్ చేయడం ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల మెదడు, మనసు ఉత్సాహంగా ఉంటాయి.
మెదడుకు వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే ధ్యానం చేయడం ముఖ్యం. ధ్యానం అనేది మెదడు ఆరోగ్యం పై పెద్ద ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా ధ్యానం చేసేవారిలో మెదడులో ఉండే గ్రే మేటర్ పెరుగుతుందని ఇదే జ్ఞాపకశక్తికి, అభిజ్ఞా పని తీరుకు ముఖ్యమైందని తెలుస్తోంది.
మనసును, మెదడును చురుగ్గా ఉంచుకునేందుకు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పని చేయడానికి ఇష్టం చూపించండి. కొత్త కోర్సులను, కొత్త ఆసక్తిని వెతుక్కోండి. కొత్త వంటకాలు చేయండి. ఖాళీగా ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడకండి. ఇలా చేస్తే 60 ఏళ్లు దాటినా కూడా మీ శరీరానికే వృద్ధాప్యం కానీ మీ మెదడుకు, మనసుకు రాదు. దీనివల్ల మీకు జీవించాలన్న కోరిక పెరుగుతుంది.