Best Web Hosting Provider In India 2024
CM Swearing Ceremony : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు 11వ తేదీ సాయంత్రం లోగా పూర్తి కావాలని ఈ కార్యక్రమ సమన్వయ అధికారి పీఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. సోమవారం గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఐటీ పార్కు మేధా టవర్స్ సమీపంలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన వేదిక వద్ద అధికారులతో కలసి ఏర్పాట్లు పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు వీర పాండ్యన్, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్, పోలీస్ అధికారులు, వివిధ జిల్లాల నుంచి విధుల నిర్వహణకై విచ్చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, తదితరులతో కలిసి సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
పటిష్ట ఏర్పాట్లు
ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ… ఈనెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారన్నారు. ఇందుకోసం ప్రధాన సభ వద్ద వేదిక, బారికేడింగ్, గ్యాలరీల ఏర్పాటు, పారిశుద్ధ్యం ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రముఖులకు వసతి, డ్యూటీ పాసులు జారీ, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించడంతోపాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. సభకు వచ్చే అతిథులకు, ప్రజలకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, అల్పాహారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖులకు, ప్రజలకు, మీడియా వారికి పాస్ లు జారీ చేయాలని, అవసరమైన సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధాన వేదిక పుష్పాలంకరణ పక్కాగా నిర్వహించాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన లేఅవుట్, గంగరాజు, విమానాశ్రయం, వెటర్నరీ కళాశాల, మేధా టవర్స్, పెట్రోల్ బంకు వద్ద పార్కింగ్ ప్రదేశాల నుంచి ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను పూర్తి చేయాలన్నారు.
ప్రధాని సహా పలువురు ముఖ్యమంత్రులు హాజరు
ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాన సభ వేదిక వద్దకు రాకపోకలు, గవర్నర్ రాకపోకల కాన్వాయ్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా పకడ్బందీగా ప్రణాళికా బద్దంగా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ప్రద్యుమ్న ఆదేశించారు. ప్రధాన వేదికతో పాటు వివిధ ప్రయాణ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు అన్నిచోట్ల సీసీటీవీ ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ లింక్ ద్వారా అన్ని జిల్లాలలో ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేయాలన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి
అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈనెల 12వ తేదీన గన్నవరం కేసరపల్లి గ్రామంలోని ఐటీ పార్క్ సమీపంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తామన్నారు.ఈ సమావేశంలో కృష్ణ జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, అధికారులు పాల్గొన్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్