Corporations and ZPTC: ఇక ఏపీలో టీడీపీ పరం కానున్న కార్పోరేషన్లు, జడ్పీ పీఠాలు

Best Web Hosting Provider In India 2024


Corporations and ZPTC: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవిని ఎరుగనిs విజయాన్ని సాధించిన టీడీపీ కూటమి ఇక స్థానిక సంస్థలపై పట్టు సాధించే ప్రయత్నాలు చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్ని ఏకగ్రీవం చేయడంపై పలు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, జడ్పీ పీఠాలను దక్కించుకునే క్రమంలో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని అప్పట్లో టీడీపీ ఆరోపించింది.

 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి ఘర్షణ తలెత్తింది. ఎన్నికల్ని వాయిదా వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌తో ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వింది. ఆ తర్వాత రకరకాల పరిణామాలు జరిగాయి. కోవిడ్‌ రెండో దశలో ఉండగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించారు.

 

నాటి ఎన్నికల్లో ప్రధాన కార్పొరేషన్లతో పాటు గ్రేడ్ వన్ మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలు, జడ్పీ పీఠాలను వైసీపీ దక్కించుకుంది. టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో అభ్యర్థుల్ని అడ్డుకోడానికి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ క్యాడర్‌ మొత్తం చెల్లాచెదురై పోయింది. స్థానికంగా పట్టున్న వాటిని కూడా నిలుపుకోలేక పోయింది.

 

ఈ క్రమంలో 204 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వైసీపీ పరాజయంలో ఆ పార్టీ తరపున స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషించారు. అధికారం ఉందని చెలరేగిపోయారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రజల్ని పీల్చుకుతిన్నారు. పట్టణాల్లో అయితే భవన నిర్మాణాలకు అనుమతి మొదలుకుని, చిన్న చితక పనులు వరకు ఎక్కడ వీలైతే అక్కడ దోచేశారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పోగవడానికి ప్రజా ప్రతినిధులే కీలక పాత్ర పోషించారు.

 

అధికారం కోల్పోవడంతో పక్క చూపులు…

ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారు కావడంతో స్థానిక సంస్థలకు సారథ్యం వహిస్తున్న నాయకులు పక్క చూపులు మొదలు పెట్టారు. మరో రెండేళ్ల పదవీ కాలాన్ని కాపాడుకోవాలంటే అధికార పార్టీలో చేరిపోవడం మేలని భావిస్తున్నారు. స్థానికంగా లభించే ఆదాయాన్ని వదులకోకూడదంటే అధికార పార్టీని ఆశ్రయించడం మేలని భావిస్తున్నారు. వైసీపీ ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే పరిస్థితి లేదని చాలామంది నేతల్లో ఉంది.

 

ప్రస్తుతం పదవుల్లో ఉన్న మేయర్లు, జడ్పీ ఛైర్మన్లు మొదలుకుని కార్పొరేటర్లు, జడ్పీటీసీ సభ్యుల వరకు వీలైనంత త్వరగా అధికార పార్టీలో చేరిపోడానికి రెడీ అవుతున్నారు. ఒంగోలు, నెల్లూరు వంటి నగరాల్లో ఇప్పటికే అలజడి మొదలైంది. సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో కార్పోరేటర్లు భేటీ అయ్యారు.

 

ప్రకాశం జిల్లాలో ఏకైక కార్పొరేషన్‌గా ఉన్న ఒంగోలులో గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మొత్తం 50 డివిజన్లలో 43 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఆరు డివిజన్లలో టీడీపీ, ఒకచోట జనసేన అభ్యర్థులు గెలిచారు. ఎన్నికల పోలింగ్‌కు ముందే వైసీపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం 11కి చేరింది.

 

ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ గంగాడ సుజాత ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లతో ఆదివారం మేయర్‌ తన ఇంట్లో సమావేశమయ్యారు. ప్రస్తుతం వైసీపీకి 39మంది కార్పొరేటర్లు ఉండగా సుమారు 27మంది ఆమెతో సమావేశమయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. కార్పొరేటర్లలో ఎక్కువమంది తమ డిమాండ్లు నెరవేరిస్తే వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు, ప్రకాశంతో పాటు రాష్ట్రంలోని అన్ని స‌్థానిక పీఠాలను వీలైనంత త్వరగా టీడీపీ దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు.

 

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కంటే చట్టపరంగానే వారిని పదవుల నుంచి తొలగించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న వారిని ఇప్పుడు టీడీపీలో చేర్చుకుంటే ఆ ప్రభావం పార్టీపై ఎంత మేరకు ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది.

 

చాలా నగరాల్లో మేయర్లుగా మహిళలు ఉన్నా వారి భర్తల పెత్తనం కార్పొరేషన్లలో సాగుతోంది. ప్రతి నెల కాంట్రాక్టులు, ముడుపుల రూపంలో కోట్లాది రుపాయలు వసూలు చేస్తున్నారు. వైసీపీని నిండా ముంచిన అవినీతి నేతల్ని టీడీపీలో చేర్చుకోవడంపై అప్రమత్తంగా ఉండాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి.

 

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

TdpYsrcpYsrcp Vs TdpAp PoliticsAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024