Nagarkurnool : కొల్లాపూర్ లో దారుణం – చెంచు మహిళను వివస్త్ర చేసి, ప్రైవేట్ భాగాలపై కారం చల్లి..!

Best Web Hosting Provider In India 2024


Tribal Woman Torture Case in Nagarkurnool : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లి గ్రామంలో అత్యంత అమానవీయఘటన జరిగింది. ఒక చెంచు మహిళ పొలాన్నే కౌలుకు తీసుకుని… అదే పొలంలో పనులు చేయిస్తున్నారు. పనికి రావటం లేదన్న కారణంతో… అత్యంత దాష్టీకానికి ఒడిగట్టారు. సదరు చెంచు మహిళను బంధించి తీవ్రంగా హింసించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే…. మొలచింతలపల్లికి చెందిన ఈశ్వరమ్మ, ఈదన్న భార్యభర్తలు. వీరికి ఇదే గ్రామంలో పొలం ఉంది. ఈ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి కౌలుకు ఇచ్చారు. అదే పొలంలో భూమి యజమానులైన ఈశ్వరమ్మ, ఈదన్న కూలీ పనులు చేస్తున్నారు.

ఇటీవల ఈశ్వరమ్మ, ఈదన్న(భార్య భర్తల) మధ్య గొడవలు రావటంతో ఈశ్వరమ్మ తన తల్లి గారి ఊరు చుక్కాయపల్లికి వెళ్లింది. అయితే పనికి రావటంతో లేదన్న కారణంతో కౌలుదారులైన బండి వెంకటేశ్ కుటుంబం…. ఆమె ఉన్న ఊరికి వెళ్లారు. ఈశ్వరమ్మను మొలచింతపల్లి గ్రామానికి తీసుకొచ్చి ఓ ఇంట్లో బంధించారు.

వెంకటేశ్ తో మిగతా బంధువులు కలిసి ఈశ్వరమ్మపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తెలిసింది. కంట్లో, ప్రైవేట్ భాగాలపై కారం చల్లి దాడి చేయటమే కాకుండా…. శరీరంపై కాల్చిన గాయాలు కూడా బయటపడ్డాయి. పరిస్థితిని గమనించిన వారంతా… విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఈశ్వరమ్మను ఆ ఇంట్లోనే ఉంచి వైద్యం అందించే ప్రయత్నం చేశారు.

ఈశ్వరమ్మ బంధించిన విషయం బయటికి రావటంతో… వారి దాష్టీకాలు బయటికి వచ్చాయి. ఆమె శరీరంపై కాలిన గాయాలు బయటపడ్డాయి. ఈ ఘటన విషయం ఆదివాసీ సంఘ నేతల దృష్టికి వెళ్లింది. స్పందించిన వారు.. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ఘటన గురించి బుధవారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈశ్వరమ్మను ఆస్పత్రిలో చేర్పించారు. భర్త ఈదన్న ఫిర్యాదుతో…. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో నలుగురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

మంత్రి పరామర్శ….

ఈశ్వరమ్మ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇవాళ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు.. బాధిత మహిళను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయంగా రూ.2 లక్షలతో పాటు భూమిని ఇస్తామని హామీనిచ్చారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టమని చెప్పారు. ఘటన సమాచారం రాగానే.. జిల్లా ఎస్పీతో మాట్లాడానని తెలిపారు. నిందితులను జైలుకు తరలించారని, విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.

చెంచు మహిళపై దాడి ఘటనను ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కౌలుదారుల దాష్టీకాలపై పారదర్శకమైన విచారణ జరిపించాలని కోరుతున్నాయి.

 

 

 

 

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Telangana NewsTrending TelanganaCrime NewsMahabubnagarCm Revanth Reddy

Source / Credits

Best Web Hosting Provider In India 2024