Best Web Hosting Provider In India 2024

లోకేష్, చంద్రబాబుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజం
చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయింపు?
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలు పూరిగుడిసెలా?
పార్టీ కార్యాలయాల పేరిట వందలకోట్ల రూపాయల స్థలాలను టీడీపీ తీసుకోలేదా?
జూబ్లీ హిల్స్‌లో పార్టీపేరిట ఉన్న స్థలం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు అప్పుడు ఎలా మారింది?
అక్కడనుంచే చంద్రబాబు తన బాగోతాలను విస్తరింపచేయలేదా?
33 ఏళ్లకు బదులు కొన్ని టీడీపీ కార్యాలయాలను 99 ఏళ్లకు కూడా చంద్రబాబు ఇచ్చుకోలేదా?
చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే వైయస్ఆర్సీపీ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తే వాటిని కూల్చేస్తారా?
అధికార మదంతో వ్యవహరిస్తే ప్రజలే గుణపాఠం చెప్తారు?
తాడేపల్లి: తాము రాజకోటలు కట్టుకున్నామని, వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్యాలెస్ ల పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శలపై సుధాకర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్టు ప్యాలెస్సా? లేక గుడిసె నా? అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తమ పార్టీ కార్యాలయాలకు స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసి, అన్ని అనుమతులతో నిర్మాణాలు చేస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ఎక్కడా అక్రమ నిర్మాణాలు చేయలేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ కట్టినవి ప్యాలెస్‌లు అయితే, టీడీపీ కట్టినవి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తన కార్యాలయాలుగా నిర్మించిన భారీ భవనాల చిత్రాలను ఆయన విడుదలచేశారు. టీడీపీ హయాంలో ఆపార్టీ ఆఫీసులకోసం చేసిన భూ కేటాయింపులు, వాటికి సంబంధించిన జీవోల కాపీలను పత్రికా సమావేశంలో చూపించిన సుధాకర్ బాబు వాటిని మీడియాకు విడుదలచేశారు.
ఆధ్యుడు చంద్రబాబే
పార్టీ ఆఫీసులకు స్థలాలు కేటాయింపు విషయానికి ఆధ్యుడు చంద్రబాబేనని సుధాకర్ బాబు గుర్తు చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనం.. గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉండేదన్నారు. ఆ స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్ పేట ఎమ్మార్వోకు బదలాయించారని, 1997 ఏప్రిల్ 30న డి. శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవనానికి కేటాయించారని తెలిపారు. శిక్షణా తరగతుల పేరిట పేద విద్యార్థులకు చదువు బాగా నేర్పించడానికి ఉపయోగిస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్టుకు బదలాయించారన్నారు. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ ప్రకారం రూ.1000 కోట్లుపైపనే ఉంటుందన్నారు. నారా చంద్రబాబునాయుడు 2014 నుంచి 2019 వరకు పాలించే సమయంలో రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం కోసం 2016 జూలై 21న టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జీవో కాపీని సుధాకర్ బాబు మీడియాకు చూపారు.
మీ పార్టీ ఆఫీసులు కట్టిన స్థలాల విలువ తెలుసా లోకేష్?
టీడీపీ తమ పార్టీ కార్యాలయాలకు కేటాయించిన టీడీపీ కేటాయించిన భూముల విలువ రూ.2 వేల కోట్లు పైనే ఉంటుందన్నారు. మంగళగిరిలో హైవే పక్కన ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం భూమి విలువే రూ.75 కోట్లు ప్రస్తుతం విలువ ఉందని సుధాకర్ బాబు అన్నారు. విజయవాడలో 95 సెంట్ల భూమి విలువ రూ.40 కోట్లు, చిలకలూరిపేటలో 20 సెంట్ల విలువ రూ.5 కోట్లు, శ్రీకాకుళంలో 2 ఎకరాల భూమి విలువ రూ.25 కోట్లు, విజయనగరంలో ఒక ఎకరం భూమి విలువ రూ.15 కోట్లు, టెక్కలిలో 30 సెంట్ల భూమి విలువ రూ.2 కోట్లు, కాకినాడలో 2 వేల గజాల భూమి విలువ రూ.10 కోట్లు, గుంటూరులో 1000 గజాల భూమి విలువ రూ.5 కోట్లు, హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ విలువే రూ.1000 కోట్లు ఉంటుందని, ఇవన్నీ కాకి లెక్కలు కాదన్నారు. ఇప్పుడు వీటి విలువ ఇంకా పెరిగిందన్నారు.
గుంటూరు, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, నెల్లూరు ప్రాంతాల్లో టీడీపీ నిర్మించిన భవనాల ఫొటోలను ఈ సందర్భంగా సుధాకర్ బాబు మీడియాకు చూపారు. జగన్ మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీ తాత జాగీరా అని మాట్లాడిన లోకేష్ వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది సహేతుకమైన రాజకీయం కాదన్నారు. అధికారం వచ్చింది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం సమంజసం కాదన్నారు. అధికారమదంతో ఈ విధంగా మాట్లాడితే మళ్లీ అధికారం నాలుగు సంవత్సరాల్లో మాయం అవుతుందని, అప్పటి పరిస్థితులను అంచనా వేయాలని హితవు పలికారు. పార్టీ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చేసే రాజకీయాలు రాష్ట్రంలో కుదరవని, ప్రజలు తెలివైన వారని చెప్పారు. ఈ దుశ్చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.
రూ.4 వేలు పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు, రైతులకు భరోసా, పోలవరం నిర్మాణం లాంటివి అమలు చేసే సమయం వచ్చిందని, కానీ ఇలా కూల్చివేత ధోరణులు, మాటల దాడులు, చేతల దాడులు, హత్యలు చేయడానికా మీకు అధికారం వచ్చింది? అని ప్రశ్నించారు.
బలమైన రాజకీయ శక్తిగా మళ్లీ పుంజుకుంటాం
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఓడిపోయి ఉండొచ్చని, కానీ 40 శాతం ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేశారన్న సంగతి మర్చిపోకూడదన్నారు. తేడా వచ్చిన 20 లక్షల మందిని ఎక్కడ ఏ లోపాలు చేసుకున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని మళ్లీ ప్రజా క్షేత్రంలోకి బలమైన రాజకీయ శక్తిగా జగన్ మోహన్ రెడ్డి గారు అవతరిస్తారని దీమా వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మధ్యలోనే ఉన్నారని, ఉంటాడని స్పష్టం చేశారు.
టీడీపీ ఆఫీసులకు కేటాయించిన స్థలాల చిట్టా ఇదిగో..
- 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం టీడీపీ కార్యాలయాలకు ఎలా స్థలాలు కేటాయించారో సుధాకర్ బాబు జీవోలతో సహా వివరించారు. ముఖ్యాంశాలు ఇవీ..
- మంగళగిరిలో సర్వే నంబర్ 392/1, 392/3, 392/4, 392/8, 392/9, 392/10, ఆత్మకూరు గ్రామం, మంగళగిరి మండలం, జీవో నంబర్ 228, 22వ తేదీ 6వ నెల 2017, కేటాయించిన భూమి 3.65 ఎకరాలు.
- 33 సంవత్సరాలు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములను మంగళగిరిలో కేటాయించుకున్న భూమిని మాత్రం 99 సంవత్సరాల పాటు రూ.1000 చొప్పున లీజుకు ఇచ్చుకున్న మాట వాస్తవమా? కాదా? ఆ జీవో నంబర్ 575. మరి ఇది తాటాకుల పందిరా?
- వైయస్ఆర్ కడప జిల్లాలో సర్వే నంబర్ 295/1అ, 1ఆలో, కడప మండలం, నాగార్జున పల్లి గ్రామంలో జీవో నంబర్ 279, 20–07–2015తేదీన 33 ఏళ్లకు రూ.1000 చొప్పున తీసుకున్నారు.
- తాడేపల్లిలో తమ పార్టీ ఆఫీసు కోసం పెట్టుకున్న దరఖాస్తులో కూడా చంద్రబాబు నాయుడు 2016లో ఇచ్చిన జీవో ప్రకారమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడిగారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాతే ముందుకెళ్లాం.
- శ్రీకాకుళంలో సర్వే నంబర్ 700/1, శ్రీకాకుళం గ్రామం, శ్రీకాకుళం మండలంలో 2 ఎకరాల భూమిని 99 ఏళ్లకు రూ.25 వేల చొప్పున లీజుకు తీసుకున్నారు.
- విజయనగరంలో సర్వే నంబర్ 15/్క, అయ్యన్న పేట గ్రామం, విజయనగరం మండలంలో, జీవో నంబర్ 195, తేదీ 23–04–2018న, 33 ఏళ్లకు రూ.1000 చొప్పున ఒక ఎకరం భూమిని తీసుకున్నారు.
- గుంటూరులో పురుషోత్తపట్నం గ్రామం, చిలకలూరిపేట మండలం, గుంటూరు జిల్లా, జీవో నంబర్ 197, తేదీ 23–04–2018న, 20 సెంట్ల భూమిని 33ఏళ్లకు రూ.1000 చొప్పున లీజుకు తీసుకున్నారు.
- కృష్ణా జిల్లా, గుణదల గ్రామం, విజయవాడ అర్బన్ మండలంలో, జీవో నంబర్ 513, తేదీ 11–10–2018న, 95 సెంట్లు, 33 ఏళ్లకు, రూ.1000 చొప్పున లీజుకు తీసుకున్నారు.
- ప్రకాశం జిల్లాలో సర్వే నంబర్ 68/8, పెళ్లూరు గ్రామం, ఒంగోలు మండలంలో, జీవో నంబర్ 514, తేదీ 11–10–2018న, 33 ఏళ్లకు 1.96 ఎకరాల భూమిని రూ.1000 చొప్పున లీజుకు తీసుకున్నారు.
- వైయస్ఆర్ కడప జిల్లాలో సర్వే నంబర్ 37/4, అక్కాయపల్లి గ్రామం, కడప మండలంలో, జీవో నంబర్ 56, తేదీ 24–01–2019న, రెండు ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు రూ.1000 చొప్పున లీజుకు తీసుకున్నారు.
- చిత్తూరులో సర్వే నంబర్ 1/1బీ3, గుండ్లాపల్లి గ్రామం, చిత్తూరు మండలంలో, జీవో నంబర్ 59, తేదీ 24–01–2019న, 1.20 ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.1000 చొప్పున లీజుకు తీసుకున్నారు.
- శ్రీకాకుళంలో సర్వే నంబర్ 106/3, కొత్తపేట గ్రామం, కొత్త అంబళ్లపల్లి మండలం, జీవో నంబర్ 63, తేదీ 24–01–2019న, 30 సెంట్ల భూమిని 33 ఏళ్లకు తీసుకున్నారు.’’ అని సుధాకర్ బాబు వివరించారు.