Advertisements Loot: ఐదేళ్లలో వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనలు, డబ్బులన్నీ ఎటు పోయాయో, చంద్రబాబు విచారణ జరిపిస్తారా?

Best Web Hosting Provider In India 2024


Advertisements Loot: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రకటనల రూపంలో ఐదేళ్లలో వందల కోట్ల రుపాయల్ని దోచిపెట్టారు. కేవలం పత్రికా ప్రకటనల కోసమే దాదాపు రూ.750కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. ఇవి కాకుండా ఔట్ డోర్ పబ్లిసిటీ, టీవీ ప్రకటనలు, ఇతర ప్రసార మాధ్యమాలకు వందల కోట్లు ఖర్చు చేశారు. వీటిలో అగ్రభాగం కొన్ని సంస్థలకే దక్కినా ప్రకటనల వ్యవహారంలో కోట్లాది రుపాయల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప ఈ వ్యవహారంలో నిజాలు బయటకు రాకపోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై శాఖల వారీగా సమీక్షిస్తున్నారు. ఆర్ధిక శాఖ ద్వారా జరిగిన చెల్లింపులను ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రకటనల కోసం చేసిన ఖర్చు వెలుగులోకి వచ్చింది. 2014-19 మధ్య కాలంలో చేసిన వ్యయం కంటే రెట్టింపు ఖర్చు చేసినట్టు స్పష్టమైంది.

భారీగా పెరిగిన ప్రకటనల వ్యయం…

ప్రకటనల వ్యయం గణనీయంగా పెరగడానికి కొన్ని సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలే కారణంగా నిర్ధారణైంది. మొత్తం వ్యయంలో ఒకటి రెండు సంస్థలకే మూడొంతుల బిల్లుల్ని చెల్లించారు. ప్రజా ధనానికి బాధ్యులుగా ఉండాల్సిన వ్యవస్థల్లో కొందరు అధికారులు తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం నేతల్ని ప్రసన్నం చేసుకునే క్రమంలో ఇలా దోపిడీకి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

2014-19 మధ్య కాలంలో ప్రభుత్వ ప్రకటనల వ్యయం రూ.444కోట్లుగా ఉంటే 2019-23 డిసెంబర్‌ నాటికి రూ.643కోట్లను దాటేసింది. సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలయ్యాక మరో రూ.150కోట్లు ప్రకటన కోసం ఖర్చు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వ ప్రకటనల జారీ బాధ్యతను సమాచార పౌరసంబంధాల శాఖకు అప్పగించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పూర్తి స్థాయిలో అమలు చేయడం మొదలైంది.

2014-19 మధ్య కాలంలో సమాచార శాఖ ద్వారా రూ.256కోట్లు చెల్లించగా, మరో రూ.188కోట్లను ప్రకటనల కోసం అయా ప్రభుత్వ శాఖలు చెల్లించాయి. 2019-24 మధ్య ఐ అండ్‌ పిఆర్‌ ద్వారా రూ.481 కోట్లు విడుదలైతే ప్రభుత్వ శాఖల ద్వారా రూ.162కోట్లను విడుదల చేశారు. 2024 జనవరి-మార్చి మధ్య కాలంలో ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు జారీ చేశారు. వీటి విలువ మరో రూ.100-150కోట్ల వరకు ఉంటుంది.

ఏపీలో గత ఐదేళ్లుగా పత్రికా ప్రకటనల కోసం చేసిన ఖర్చును లెక్కిస్తున్న అధికారులు కేవలం ఒక్క పత్రికకే బడ్జెట్‌ కేటాయింపుల్లో అగ్రభాగం చెల్లించినట్టు ఇప్పటికే గుర్తించారు. వార్షిక బడ్జెట్‌ కేటాయింపులకు మించి ఒకే ఒక్క పత్రికకు ఎడాపెడా ప్రకటనలు ఇచ్చేశారు. ఉన్న బడ్జెట్‌లో తొలి ప్రాధాన్యతలో దానికే చెల్లింపులు జరిపారు. ఇలా ఐదేళ్లలో దాదాపు రూ.300కోట్లను ఒకే ఒక్క సంస్థకు చెల్లించినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

సంస్థల వారీగా చెల్లింపులు….

2023 డిసెంబర్‌ నాటికి ఏపీలో పత్రికా ప్రకటనల కోసం సాక్షికి 300.52 కోట్లు, ఈనాడుకు రూ.218.8 కోట్లు, ప్రజాశక్తికి రూ.9.85కోట్లు, వార్తకు రూ.10.85కోట్లు, విశాలాంధ్రకు రూ.14.5కోట్లు, హిందూ ఆంగ్ల పత్రికకు రూ.39.29కోట్లు, టైమ్స్‌ ఆఫ్ ఇండియాకు రూ.16.36కోట్లు, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రూ.28.56కోట్లు, డెక్కన్ క్రానికల్‌కు రూ.41.39కోట్లు, హన్స్‌ ఇండియాకు రూ.6.88కోట్లు, పయనీర్‌‌కు రూ.9.03కోట్లు చెల్లించారు.

చిన్న పత్రికలకు ఐదేళ్లలో కేవలం రూ.32లక్షలు చెల్లించారు. పిరియాడికల్స్‌ సావనీర్లకు రూ.5కోట్లు చెల్లించారు. విచిత్రం ఏమిటంటే వీటి జాబితాను సమాచార శాఖ ఎప్పుడు బయటపెట్టదు. ఇందులోనే అధికారుల చేతివాటం ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీల నేతలు ప్రచురించే కాఫీ టేబుల్ బుక్స్‌, మ్యాగ్‌జైన్స్‌, ప్రచార పుస్తకాలకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో చెల్లింపులు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2014-19 మధ్య కాలంలో చిన్న పత్రికలకు రూ.2.36కోట్ల విలువైన ప్రకటనలు విడుదల చేశారు. అప్పట్లో కూడా మ్యాగ్‌జైన్లు, సావనీర్లకు రూ.5.97కోట్లు విడుదల చేశారు.

ఏపీలో కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రకటనలన్నీ సమాచార శాఖ ద్వారా విడుదల చేస్తున్నారు. 2017లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రకటనల జారీ అధికారం మొత్తం ఐ అండ్‌ పిఆర్‌ డిపార్ట్‌మెంట్‌‌కు కేటాయిస్తూ జీవో 124 జారీ చేశారు. దీని ప్రకారం అన్ని డిపార్ట్‌మెంట్స్‌ పేమెంట్‌ బై పార్టీ ప్రకారం క్లాసిఫైడ్స్‌, డిస్‌ప్లే యాడ్స్‌, ఫుల్ పేజీ ప్రకటనల్ని వివిధ సందర్భాల్లో పత్రికలకు విడుదల చేస్తుంటారు. ప్రకటన ప్రచురించిన తర్వాత అందుబాటులో ఉన్న బడ్జెట్‌ను బట్టి బిల్లులు విడుదల చేస్తుంటారు.కొన్ని ప్రత్యేక సందర్భాలు, సమ్మిట్లలో మాత్రమే అయా శాఖలు నేరుగా చెల్లింపులు జరిపేవి.

ప్రకటనల కేటాయింపు కూడా సర్క్యూలేషన్ ఆధారంగా విడుదల చేస్తుంటారు. తెలుగులో ప్రధాన పత్రికలు రెండింటికి అగ్రభాగం ప్రకటనలు కేటాయిస్తూ వచ్చారు. వీటిలో ఒకదానికి బిల్లులు భారీగా పేరుకు పోవడంతో ప్రభుత్వ ప్రకటనల్ని ప్రచురించడానికి నిరాకరించింది. దీంతో దాదాపు ఏడాదికి పైగా ఆ సంస్థ ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించలేదు.గత ఐదేళ్లలో కోటి రుపాయలకు మించి ఖరీదు చేసే ప్రకటనలు చెల్లింపులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో పెద్ద పత్రికలకు బిల్లులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం మారడంతో మళ్లీ కొన్నిపత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలను ప్రచురిస్తున్నాయి.

ఆర్థిక శాఖ ఆరా…

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటనల రూపంలో జరిగిన చెల్లింపులపై ఆర్ధిక శాఖ ఆరా తీస్తోంది. ఒక్క పత్రికకు మాత్రమే ఏటా రూ.60-70 కోట్ల రుపాయలు కేటాయించడం, వాటికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు కూడా పూర్తి చేయడంతో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులు నిధుల విడుదల అంశాన్ని ఆరా తీయడంతో ప్రకటన వ్యవహారం వెలుగు చూసింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో సమాచార శాఖలో ప్రింట్‌ మీడియా ప్రకటనలకు 128కోట్ల కేటాయింపులు ఉంటే ఒక్క పత్రికకు దాదాపు 100కోట్ల రుపాయల వరకు చెల్లింపులు జరిపినట్టు గుర్తించారు. తొలి నాలుగేళ్లలో మరో రూ.200కోట్ల రుపాయల వరకు ప్రింట్ ప్రకటనల కోసం చెల్లించినట్టు తెలుస్తోంది.

2023 జనవరి 1నుంచి డిసెంబర్ 31 వరకు సుమారు 63 ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చినట్లుగా లెక్కల్లో పేర్కొన్నారు. 18 హాఫ్ పేజీ యాడ్స్, 5 స్ట్రిప్ యాడ్స్ ఇచ్చినట్టుగా గుర్తించారు. ఇందుకోసం ఆ సంస్థకు దాదాపు రూ.100 కోట్లను బిల్లులుగా చెల్లించారు. క్లాసిఫైడ్స్, డిస్‌ ప్లే యాడ్స్‌ కలుపుకుంటే మరో రూ.10 కోట్లు అదనంగా చెల్లించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

2024 జనవరి నుండి మార్చి 12వ తేదీ వరకు 20 ఫుల్ పేజీ ప్రకటనలు, 2 హాఫ్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. దీనికోసం దీనికి సుమారు 27 కోట్లు బిల్లులు చెల్లించారు. ప్రతివారం మైనింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ ద్వారా ఇచ్చిన ఇసుక ధరల ప్రకటనల బిల్లుల్ని నేరుగా ఆ శాఖ చెల్లించింది. ఇవి ప్రభుత్వ ప్రకటనలకు అదనంగా లెక్కించాల్సి ఉంటుంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క పత్రికకు 75 ఫుల్ పేజీ యాడ్స్ 7 హాఫ్ పేజీ యాడ్స్, క్లాసిఫైడ్ స్ట్రిప్ యాడ్స్ విడుదల చేశారు.ఇసుక ధరల ప్రకటనలు అదనంగా చెల్లించారు. ఇలా ఏడాదిలో దాదాపు రూ.120కోట్లు చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. వార్షిక బడ్జెట్‌ రూ.138 కోట్లు ఉంటే దానికి మించి ఒక్క పత్రికకు చెల్లింపులు జరపడంపై ఆర్ధిక శాఖ విస్మయం వ్యక్తం చేస్తోంది.పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే తప్ప ఐదేళ్లలో ప్రకటనల్లో ఏమి జరిగిందో బయటకు తెలియకపోవచ్చని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రకటనల జారీలో మాయాజాలం….

అధికారాన్ని అడ్డం పెట్టుకుని డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అధికారి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కోర్టును కూడా అధికారులు తప్పు దోవపట్టించినట్టు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనల జారీలో ఏజెన్సీలను తొలగించి నేరుగా ప్రకటనలు జారీ చేయడం ద్వారా భారీగా ఆదా చేశామని చెప్పుకున్నారు.

అయితే డిఏవిపి ప్రకటనల జారీ మార్గదర్శకాలను, నిబంధనలను ఏపీలో ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రకటనల డిజైనింగ్‌ బాధ్యత గతంలో ఏజెన్సీలు చేపట్టేవి. గత ఐదేళ్లలో నేరుగా డిజైన్లను తయారు చేసి పత్రికలకు జారీ చేసేవారు. ఈ డిజైన్లలో క్రియేటివిటీ మాట అటుంచితే సొంత పైత్యం ఎక్కువగా కనిపించేది. సృజనాత్మకత మాట అటుంచితే ఐదేళ్ల పాటు ఒకే ఒక్క డిజైన్‌ను కొనసాగించి రికార్డు సృష్టించారు.

ప్రకటనల తయారీ సొంతంగా రూపొందించడం ద్వారా ఖజానాకు డబ్బులు ఆదా చేసినట్టు చూపినా, ఏజెన్సీలకు కూడా డిజైనింగ్ ఫీజులు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి ఆదా ఏమి జరగలేదని తెలుస్తోంది. గతంలో ప్రకటనల తయారీలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీలు పాల్గొనేవి. నాలుగైదు ఏజెన్సీలు రూపొందించిన ప్రకటనల్లో బాగున్న వాటిని ఎంపిక చేసిన తర్వాత వాటిలో కూడా పత్రికల్లో దేనిని ప్రచురించాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసేది.

గత ఐదేళ్లలో పేజీ నిండా అక్షరాలను కుక్కేసి, వాటినే ప్రకటనలుగా పేర్కొనే విధానాన్ని అమలు చేశారు. పత్రికల్లో తాము చెప్పాలనుకుంటున్న సమాచారం పూర్తిగా రావాలంటే ఇదొక్కటే మార్గమని అధికారులు భావించేవారు. ఈ డిజైన్లను ఇన్‌హౌస‌లోనే తయారు చేసినా ఏజెన్సీలకు కూడా డిజైనింగ్ ఫీజులు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఏపీలో అక్రిడేషన్ల జారీ మొదలు వార్తల స్క్రీనింగ్ వరకు రకరకాల ఆంక్షల్ని అమలు చేశారు. సమాచార సేకరణ విషయంలో కూడా ఏకపక్ష విధానాలను అమలు చేశారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ వ్యవహారాలపై విచారణ జరిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsChandrababu NaiduGovernment Of Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsAmaravati

Source / Credits

Best Web Hosting Provider In India 2024