Bandi Sanjay: మెగాస్టార్ తో మాస్ లీడర్.. చిరంజీవితో కేంద్రమంత్రి బండి సంజయ్ భేటీ

Best Web Hosting Provider In India 2024


Bandi Sanjay: జూబ్లిహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి బండి సంజయ్ చేరుకోగా చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. అప్యాయంగా పలుకరించి ఆలింగనం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళారు. శాలువా కప్పి సత్కరించారు. ఎంతో కష్టపడి పైకొచ్చారని, మంత్రి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు చిరంజీవి. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్ లభించిందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ నేను విద్యార్ధి దశలో మీ సినిమాలకు అభిమానినని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురు దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

భారత్ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ

భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ యుద్దాల సమయంలో జన సంఘ్ కార్యకర్తలకు తుపాకీలిచ్చి సైనికులతోపాటు భారతదేశం పక్షాన యుద్దానికి పంపి పార్టీ కంటే దేశం ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు.

దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ లో ఏకైక ప్రతిపక్ష నేత ఆయనేనని తెలిపారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్దంతి సందర్భంగా కరీంనగర్ లో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు మహాశక్తి అమ్మవారి ఆలయంలో సంజయ్ తన మాతృమూర్తి శకుంతల సమక్షంలో మొక్క నాటించారు. అనంతరం శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను, త్యాగాన్ని స్మరిస్తూ ప్రకటన విడుదల చేశారు.

కాశ్మీర్ వెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిట్ కార్డు తప్పనిసరి చేస్తే నా దేశం వెళ్లడానికి పర్మిట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ నహీ ఛలేగా…నహీ ఛలేగా’ అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు.

ఆనాడు పర్మిట్ అవసరం లేదని పేర్కొంటూ కశ్మీర్ బయలుదేరిన శ్యామా ప్రసాద్ ముఖర్జీని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి కనీస సౌకర్యాలు లేని జైల్లో నిర్బంధానికి గురి చేసిందని తెలిపారు. ఆనాడు అటువైపుగా వెళుతున్న నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ముఖర్జీని పరామర్శించకుండా వెళ్లిపోయారని నిర్బంధంలోనే అనుమానాస్పద స్థితిలో ముఖర్జీ మరణిస్తే కనీసం విచారణ జరపని అమానవీయ ప్రభుత్వం కాంగ్రెస్ దని విమర్శించారు.

ఆయన చనిపోయాక కాశ్మీర్ కు వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసిందని అది బీజేపీ సాధించిన తొలి విజయమని తెలిపారు. దేశం కోసం యుద్దం చేయడానికి సిద్దంగా ఉండాలని జన సంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్ పై యుద్దం చేయడానికి పంపిన వీరుడని కొనియాడారు.

శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను, ఆశయాలను, ఆకాంక్షలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ముఖర్జీ ఆకాంక్షలకు అనుగుణంగా వాజ్ పేయి ప్రభుత్వం అణ్వాయుధాలను సమకూరిస్తే… 370 ఆర్టికల్ ను రద్దు చేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను నరేంద్రమోదీ నెరవేర్చారని తెలిపారు. దేశ విభజన సమయంలో అనుకోని పరిస్థితుల్లో మాతృభూమికి తిరిగి వస్తే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్రమోదీదే….శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఫలాలను నేరుగా లబ్దిదారులకు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదేనని తెలిపారు.

రామక్రిష్ణను పరామర్శించిన బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఇటీవల సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరి గుండె ఆపరేషన్ చేయించుకున్న ప్రతాప రామక్రిష్ణ మియాపూర్ లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతాప రామక్రిష్ణను కలిసిన బండి సంజయ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి)

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

Telangana BjpGovernment Of IndiaBandi SanjayTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024