Warangal JUDA: వరంగల్ ఎంజీఎంలో సమ్మెకు దిగిన జూనియర్​ డాక్టర్లు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​

Best Web Hosting Provider In India 2024


Warangal JUDA: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జూనియర్​ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కాకతీయ మెడికల్​ కాలేజీ పరిధిలోని అన్ని బోధనాసుపత్రుల్లో కొద్ది రోజులుగా ఆందోళనలు చేపడుతున్న జూడాలు.. సోమవారం విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు.

ఉదయం నుంచే ఓపీ సేవలను బహిష్కరించి, ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో దీక్షకు దిగారు. దీంతో ఓపీ సేవల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జూనియర్​ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ఓపీ సేవలకు అంతరాయం కలగకుండా ఎంజీఎం ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేసినా చాలామంది పేషెంట్లు ఇబ్బందులు పడక తప్పలేదు.

ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపేస్తాం: జూడాలు

కాకతీయ మెడికల్​ కాలేజీతో పాటు రాష్ట్రంలోని ఇతర గవర్నమెంట్​ హాస్పిటల్స్​ లో సమస్యలను పరిష్కరించాలని జూనియర్​ డాక్టర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఎంజీఎం ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారు. ప్రధానంగా ఎనిమిది డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు.

ఈ సందర్భంగా జూనియర్​ డాక్టర్లు మాట్లాడుతూ కాకతీయ మెడికల్​ కాలేజీలో రోడ్లు సరిగా లేక విద్యార్థులు గాయాల పాలవుతున్నారని, వెంటనే కేఎంసీ క్యాంపస్​ పరిధిలో రోడ్లు వేయాలని డిమాండ్​ చేశారు. జూనియర్​ డాక్టర్ల ఉపకార వేతనాలు కూడా క్రమబద్ధీకరించాలని, ఉస్మానియా జనరల్​ ఆసుపత్రికి కొత్త బిల్డింగ్​ నిర్మించాలని కోరారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ మెడికల్​ కాలేజీల్లో సరిపడా హాస్టల్​ బిల్డింగ్స్ నిర్మించాలన్నారు. మెడికల్​ కాలేజీల్లో మౌళిక వసతులు కల్పించడంతో పాటు రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని మెడికల్​ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్​ స్టూడెంట్లకు 15 శాతం రిజర్వేషన్​ కల్పించే విధానాన్ని తొలగించాలని డిమాండ్​ చేశారు.

సూపర్​ స్పెషాలిటీ సీనియర్​ రెసిడెంట్లకు గౌరవ వేతనం అందించాలని డిమాండ్​ చేశారు. కాగా సోమవారం అత్యవసర మినహా మిగతా ఓపీ సేవలు మాత్రమే బహిష్కరించి సమ్మెకు దిగగా, తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపి వేస్తామని జూనియర్​ డాక్టర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుండా సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

డాక్టర్ల సమ్మెతో పేషెంట్లకు ఇబ్బందులు

కాకతీయ మెడికల్​ కాలేజీకి చెందిన జూనియర్​ డాక్టర్లంతా విధులు బహిష్కరించడంతో ఎంజీఎం ఆసుపత్రిలో సేవలు స్తంభించి పోయాయి. పీజీలు, హౌస్​ సర్జన్లు మొత్తంగా వెయ్యి మందికి పైగా డాక్టర్లు విధులను బహిష్కరించి, ఆందోళనలో పాల్గొనగా, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్​, కేఎంసీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సేవలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్ద ఎత్తున తరలి రాగా, ఎంజీఎం ఉన్నతాధికారులు సెలవులో ఉన్న డాక్టర్లను వెనక్కి రప్పించి, సేవలందించే ప్రయత్నం చేశారు. సోమవారం ఒక్క ఎంజీఎంలోనే దాదాపు 3 వేల వరకు ఓపీ నమోదవగా, సకాలంలో సేవలందక పేషెంట్లు ఆసుపత్రి విభాగాల్లో బారులు తీరారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం స్పందించి, వైద్య సేవలకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎంజీఎం కు వచ్చిన రోగులు విజ్ఞప్తి చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

WarangalProtestsAndhra Pradesh NewsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024