AP IAS Postings Issue: ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగులపై కొనసాగుతున్న రగడ

Best Web Hosting Provider In India 2024


AP IAS Postings Issue: ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు పోస్టింగుల వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో రచ్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ అనుకూల అధికారులుగా ముద్ర పడిన వారికి టీడీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గోపాలకృష్ణ ద్వివేదికి మొదట కీలక బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. శాఖను మార్చినా అవి చల్లారలేదు. దీంతో ఆయన్ని జిఏడిలో రిపోర్ట్‌ చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ, గనుల శాఖ బాధ్యతలు అప్పగించినా ఆ తర్వాత కార్మిక శాఖకు బదిలీ చేశారు. కార్మికశాఖ బాధ్యతలు అప్పగించడంపై కూడా విమర్శలు కొనసాగాయి.

గోపాల కృష్ణ ద్వివేది 2019 ఎన్నికలకు ముందు ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈసీ నిబంధనల పేరుతో చంద్రబాబును సచివాలయంలోకి అడుగు పెట్టకుండా చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈసీ తీరుకు చంద్రబాబు సచివాలయం మెట్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో ఉద్యోగ నియామకాలు ఆయన హయంలోనే చేపట్టారు. ప్రశ్నాపత్రాల లీకయ్యాయని ఆరోపణలు వచ్చినా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత పంచాయితీరాజ్‌, మైనింగ్ శాఖల్లో కూడా పనిచేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, ఖనిజ సంపద దోపిడీకి ప్రభుత్వానికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీ హయంలో గ్రామ, వార్డు సచివాలయాలకు పార్టీ రంగులను వేయడంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు పూర్తిగా సహకరించారనే ఆరోపణలు ద్వివేదిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద్వివేదిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్మికశాఖ కార్యదర్శి నాయక్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

వారికి ఎందుకు మినహాయింపు…

కొత్త ప్రభుత్వంలో కీలక పోస్టులు దక్కించుకన్న మరికొందరు అధికారులపై కూడా విమర్శలు కొనసాగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సచివాలయ సిబ్బందితో పెన్షన్లను పంపిణీ చేయకుండా అటంకాలు సృష్టించిన గ్రామీణాభివృద్ధి పంచాయితీరాజ్‌ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌‌‌కు కొనసాగించడంపై కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో శశిభూషణ్‌ కుమార్ ముందు ఆ పదవిలో ఉన్న బుడితి రాజశేఖర్‌ నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయక పోవడంతో పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయితీ రాజ్‌శాఖలో చెల్లింపులు, పదోన్నతుల విషయంలో సిఎంఓలో కీలకంగా పనిచేసిన అధికారితో పాటు ప్రభుత్వ సలహాదారులు చెప్పినట్టు చేయడానికి నిరాకరించడంతో బదిలీచేశారు. ఆ సమయంలో తమ చెప్పుచేతల్లో పనిచేసే అధికారిని పంచాయితీరాజ్‌ శాఖ బాధ్యతలు అప్పగించినట్టు అధికార వర్గాల్లో ప్రచారం ఉంది.

వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి సదరు అధికారే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పనులు నిలిపివేయడం, కాంట్రాక్టర్లను మార్చడం వంటి నిర్ణయాలతో జరిగిన జాప్యంతో డయాఫ్రం వాల్ వరదల్లో కొట్టుకుపోయింది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ఉన్న అధికారికి స్నేహితుడు కావడంతో పోస్టింగ్ దక్కినట్టు ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్ అధికారుల్లో నోటి దురుసు అధికారిగా గుర్తింపు పొందారు. కింది స్థాయి ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడతారనే ప్రచారం ఉంది.

2019లో ఆయన ఇంట్లో భారీగా నగదు, సొత్తు చోరీకి గురైతే అప్పట్లో విజయవాడ సీపీగా పనిచేసిన ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు ద్వారా నిందితుల్ని వెదికి పట్టుకున్నట్లు తెలుస్తోంది. . ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాకుండా, బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్ని కొనసాగించడంపై టీడీపీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిఎంఓలో ఉన్న ప్రద్యుమ్నపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కొనసాగుతోంది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

Government Of Andhra PradeshChandrababu NaiduTdpAp PoliticsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024