Best Web Hosting Provider In India 2024

Suriya Sudha Konagara Movie: తమిళ స్టార్ హీరో సూర్య, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుధ కొంగర కలిసి మరో మూవీ తీస్తున్నారు. చాలా రోజుల కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ గురించి సుధ వెల్లడించింది. ఇది తమిళనాడులో 1960ల్లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా రూపుదిద్దుకోనుండటం విశేషం.
సూర్య, సుధ కొంగర మూవీ ఇదే
మన తెలుగు మహిళ అయిన సుధ కొంగర గతంలో సూర్యతో కలిసి తీసిన సూరారై పొట్రు పెద్ద విజయం సాధించింది. ఈ బయోగ్రఫికల్ మూవీకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి పురననూరు అనే మరో మూవీ చేయబోతున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధ కొంగర వివరించింది.
వ్యవస్థను ఎదిరించే సినిమా ఇది అని ఆమె చెప్పింది. 1960ల్లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో సాగుతుందని తెలిపింది. “ఇది వ్యవస్థను ఎదిరించే స్టోరీ. నాకు అలాంటివే నచ్చుతాయి. అవును పురననూరు 1960ల్లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో సాగే కథ. ఇది అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తే సినిమా. నాకు తెలిసి నా సినిమాలన్నీ అణచివేతపై పోరాటం చేసే సినిమాలే” అని ఆమె చెప్పింది.
ఈ సందర్భంగా తన గత సినిమాల గురించి కూడా వివరించింది. తన మూవీ సాలా ఖడూస్ (తెలుగులో గురు) గురించి చెబుతూ.. “ఆ అమ్మాయి అన్ని అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది మహిళలు పితృస్వామ్య వ్యవస్థ పరిణామాలను ఎదుర్కొంటున్నారు. మనం దానిని అంగీకరించి, అధిగమించాలి. సమాజంలో ప్రతి వేర్పాటు, అణచివేత, విభజన ఉన్నాయి. వాటి గురించి ఆందోళన చెందే కంటే వాటిని అధిగమించడం మంచిది” అని సుధ చెప్పింది.
సూర్య 43వ సినిమా..
తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్లో 43వ సినిమాగా ఈ పురననూరు వస్తోంది. ఈ మూవీలో సూర్యతోపాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా, విజయ్ వర్మలాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ప్రస్తుతం సుధ కొంగర తన సూరారై పొట్రు మూవీ హిందీ వెర్షన్ సర్ఫిరా డైరెక్ట్ చేస్తోంది. ఇందులో సూర్య పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. ఈ మధ్యే మూవీ ట్రైలర్ రిలీజైంది. ఒక రూపాయికే విమాన టికెట్ అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా కోసం సుధకు నేషనల్ అవార్డు లభించింది.
Best Web Hosting Provider In India 2024
Source / Credits