
Best Web Hosting Provider In India 2024

Mahabubabad News : స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువకుడు ఓ కానిస్టేబుల్ కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ తనను పుట్టినరోజు నాడే అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మహబూబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్ బజార్ కు చెందిన బత్తిని ఉదయ్ కుమార్ గతంలో ఓ వ్యక్తికి దాదాపు 12 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కానీ అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ కుమార్ పలుమార్లు ఆయనను నిలదీశాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఆరు నెలల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు.
అన్నా.. అన్నందుకు బూతులందుకున్న కానిస్టేబుల్
పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్న వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో ఉదయ్ కుమార్ మరోసారి ఆయనపై ఫిర్యాదు చేసేందుకు మంగళవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రుద్రయ్య స్టేషన్ కు వచ్చిన ఉదయ్ కుమార్ ను గమనించాడు. విషయం ఏంటో తనకు చెప్పాల్సిందిగా అడిగాదు. దీంతో తనకు ఓ వ్యక్తి రూ.12 లక్షల వరకు బాకీ ఉన్నాడని, ఆయనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చానని కానిస్టేబుల్ రుద్రయ్యను అన్నా అంటూ సంబోధిస్తూ తెలిపాడు. అన్నా అని పిలవడం ఇష్టం లేని రుద్రయ్య వెంటనే బూతు పురాణం అందుకున్నాడు. ఇష్టమొచ్చినట్టు తిట్టడమే కాకుండా అసభ్య పదజాలంతో తీవ్రంగా దూషించాడు. ఉదయ్ కుమార్ ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు.
బర్త్ డే రోజే తిట్టాడని మనస్తాపం
సమస్య మీద ఫిర్యాదు చేసేందుకు వస్తే కానిస్టేబుల్ నానా బూతులు తిట్టినందుకు ఉదయ్ కుమార్ తీవ్ర మనస్తాపం చెందాడు. అంతేగాకుండా మంగళవారం ఉదయ్ కుమార్ పుట్టిన రోజు కాగా, బర్త్ డే రోజే కానిస్టేబుల్ తిట్టడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన ఉదయ్ కుమార్ ఇంట్లో ఉన్న నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఉక్కిరి బిక్కిరవుతున్న ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు నిలదీయడంతో తాను నిద్ర మాత్రలు మింగిన విషయం చెప్పాడు. దీంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ తరచూ తమను స్టేషన్ కు పిలిచి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అకారణంగా కానిస్టేబుల్ రుద్రయ తనను అసభ్య పదజాలంతో దూషించడం వల్లే ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ జరిపించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉంటే ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు స్టేషన్ సిబ్బంది వ్యవహార శైలే కారణమని తేలగా, ఇప్పుడు ఈ ఘటనతో మహబూబాబాద్ జిల్లాలో కలకలం మొదలైంది. కాగా పోలీస్ ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి, సిబ్బంది పని తీరులో మార్పు తీసుకు రావాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్