Bandi Sanjay: ఎర్ర చందనం దోచుకున్న ఏపీ వీరప్పన్‌ వారసులెవరో తేలుస్తామన్న బండి సంజయ్

Best Web Hosting Provider In India 2024

Bandi Sanjay: ఏపీలో కొందరు నేతలు నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు పెట్టారని,ఎర్రచందనం స్మగ్లర్లు సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారని, ఆ దొంగలను వదిలే ప్రసక్తే లేదని, ఎర్ర చందనం సహా శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక కోరతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రకటించారు.

నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ ఎర్రచందనం దొంగలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న దొంగల పాలన పోయిందని, నిత్యం గోవిందుడి స్మరణ చేసే సేవకుల పాలన వచ్చిందన్నారు. తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేశారన్నారు. గత పాలనలో వీరప్పన్ వారసులు శేషాచల కొండల్లోని జాతీయ సంపదైన ఎర్రచందనం స్మగ్లింగ్ తో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్రుష్టికి తీసుకెళ్లడంతోపాటు నివేదిక తెప్పించుకుంటామన్నారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదన్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, వైకుంఠాధీశుడు శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు ప్రజలంతా చల్లగా ఉండాలని, రెండు రాష్ట్రాలు బాగుండాలని, దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చల్లని చూపు చూడాలని, భారత్ ను విశ్వగురు స్థానంలో నిలిపేందుకు క్రుషి చేస్తున్న నరేంద్రమోదీకి ఆశీస్సులు అందించాలని స్వామివారిని మొక్కుకున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం తిరుమలలో భక్తియుత, ధార్మిక వాతావరణం నెలకొంది. కానీ మొన్నటి వరకు దేవుడిని నమ్మని వాళ్లు, ధర్మం గురించి ఆలోచించని వాళ్లు పేరుకు నామాలు పెట్టుకుని స్వామివారి ఆస్తులకే పంగనామాలు పెట్టారు. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మొన్నటి వరకు మారిది. పదవుల కోసం టీటీడీని వాడుకున్నారు. ఆ నయవంచుకుల పాలన పోయింది. నిత్యం వెంకటేశ్వర నామస్మరణ చేసే సేవకుల రాజ్యం వచ్చిందన్నారు.

తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమలను అపవిత్రం చేయడానికి, సొంత ఆస్తులను పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని ఆరోపించారు. అందుకే రెండు కొండల వాడా గోవిందా..గోవిందా అనే పాలన పోయింది. అరాచక పాలన పీడ విరిగింది. ఏడుకొండల వాడా గోవిందా…గొవిందా.. అని సేవ చేసే రాజ్యం వచ్చిందన్నారు.

తాను నిన్న వచ్చానని, ప్రజలు వచ్చి గత పాలకులు చేసిన అక్రమాలు, నిర్వాకాలు చెబుతున్నారని, లంగ దందాలు, లఫంగ దందాలు చేశారని, శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారనిఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి సంపద, జాతీయ సంపదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటూ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు. రాజకీయ నేతలను వాళ్ల గుప్పిట్లో పెట్టుకున్నారు. పార్టీలు నడవాలన్నా… ఎన్నికల్లో గెలవాలన్నా తమ చలువ ఉండాలనే స్థాయికి దిగజారారు. చివరకు ప్రభుత్వానికి అప్పులిచ్చే స్థాయికి వచ్చారని మండిపడ్డారు.

ఈ విషయాన్ని వదిలిపేట్టే ప్రసక్తే లేదని దీనిపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు మాట్లాడారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్రుష్టికి తీసుకెళ్లతామని జాతీయ సంపద దోచుకున్న అంశంపై నివేదిక తెప్పించుకుంటామన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడమని శ్రీవారి సంపదను కాపాడే విధంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

WhatsApp channel

టాపిక్

Bandi SanjayAp BjpJanasenaTtdTirumalaJanasena VarahiYsrcp Vs Janasena
Source / Credits

Best Web Hosting Provider In India 2024