Rice In Raithu Bazars: రైతు బజార్లలో రాయితీ ధరలకే బియ్యం, కందిపప్పు విక్రయాలు ప్రారంభించిన నాదెండ్ల మనోహర్

Best Web Hosting Provider In India 2024

Rice In Raithu Bazars: బహిరంగ మార్కెట్లో చుక్కలనంటుతున్న నిత్యావసర సరుకుల ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాయితీపై రైతు బజార్లలో బియ్యం, కంది పప్పు విక్రయిస్తున్నామని ప్రకటించారు. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు ఇస్తున్నామని, కనీస స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉంచి ప్రజల డిమాండ్ ఆధారంగా వాటి సామర్థ్యం పెంచుతామన్నారు. గురువారం విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్ లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యం, కంది పప్పు అమ్మకాల కౌంటర్ ను స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు.

“పేదలకు ఇది పండగ రోజు అని, సామాన్యుడికి నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 284 స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

కందిపప్పు బహిరంగ మార్కెట్ లో దాదాపు కిలో రూ.181 అమ్ముతున్నారని, బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని అవుట్ లెట్లు ప్రారంభించామని చెప్పారు. సివిల్ సప్లైస్‌ ఔట్‌ లెట్లలో కిలో దేశవాళి కందిపప్పు రూ.160కే అందిస్తున్నట్టుచెప్పారు. సోనామసూరి (స్టీమ్డ్) బియ్యం కిలో రూ.49కు , సాధారణ రకం రూ.48 విక్రయిస్తున్నట్టు చెప్పారు.

ప్రతి రోజు 125 క్వింటాల కందిపప్పు అందుబాటులో ఉండేటట్లు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజల డిమాండ్ ఆధారంగా దీనిని పెంచుతామన్నారు. రాబోయే రోజుల్లో కందిపప్పు, బియ్యంతో పాటు మిల్లెట్స్, పంచదార, రాగి పిండి తక్కువ ధరకే అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రైతు, వినియోగదారుడికి మేలు జరగాలన్నదే మా ఆకాంక్ష అని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

రూ.1000 కోట్లు విడుదల….

రైతుల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అనేక పర్యటనలు చేశామని, వరుస ప్రకృతి విపత్తుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర రాక తీవ్ర మనోవేదన అనుభవించారని నాదెండ్ల చెప్పారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి కూడా గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించేది కాదు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, సేకరించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించాలని గతంలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో దీక్ష కూడా చేశారని, అయినా నాటి ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించకుండా రూ.1650 కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రూ. 1000 కోట్లు రైతులకు బకాయిలు చెల్లించినట్టు చెప్పారు. మరో రూ. 650 కోట్లు త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

అయిదుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర

రాజకీయాల ముసుగులో కొంతమంది పెద్దలు పేదల బియ్యాన్ని కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తారని నాదెండ్ల ఆరోపించారు.తమ ప్రభుత్వంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రిస్తున్నామన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు ఒక్క కాకినాడలోనే 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని ఈ మాఫియా వెనక చాలా మంది పెద్దల హస్తం ఉందని చెబుతున్నారని, ఐదుగురు ఐపీఎస్ అధికారుల హస్తం ఉందని అధికారులు గుర్తించారని దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. దోషులుగా తెలితే ఎంతటి వారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

WhatsApp channel

టాపిక్

RicePrice HikeGovernment Welfare SchemesAndhra Pradesh NewsTdpChandrababu NaiduJanasenaNadendla Manohar
Source / Credits

Best Web Hosting Provider In India 2024