
Best Web Hosting Provider In India 2024

AP Reservations: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో భారీ అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల్లో సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో రిజర్వేషన్ల అమలును పరిశీలించాలని అధికారులను సాంఘిక సంక్షేమ బాలవీరాంజనేయ స్వామి అధికారుల్ని ఆదేశించారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై అధికారులతో చర్చించిన మంత్రి, అధికారులు బాధ్యతాయుతంగా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు.
ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో అధికార పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల్ని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో చేర్చుకుని వందల కోట్ల దుర్వినియోగం చేసిన వ్యవహారం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెలుగు చూసింది. చాలా నియామకాల్లలో నిబంధనలు పాటించకపోవడం, నోటిఫికేషన్లు లేకుండానే ఉద్యోగాలిచ్చేసి జీతాలు చెల్లించడం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్, ఏపీఎండిసి, సిఎఫ్‌ఎంఎస్, ఆర్టీజిఎస్, ఏపీడీసీ వంటి సంస్థల్లో ఓ పార్టీకి, ఓ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం వెలుగు చూస్తోంది.
కేవలం రికార్డుల్లో మాత్రమే ఉన్న ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వహించకుండా ఐదేళ్ల పాటు ప్రభుత్వ జీతాలు అందుకున్నారు. ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలను అనర్హులకు ఇవ్వడంపై టీడీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అప్కాస్ పేరుతో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపధ్యంలో వెలగపూడిలోని సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ఉద్యోగాల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై సాధ్య సాధ్యానాలు పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు.
అధికారులు బాధ్యతతో పనిచేయాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేలా వారికి సమాచారం అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు
టాపిక్