
Best Web Hosting Provider In India 2024

Bandi Vs KTR: సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ విషయమై ప్రధాని మోదీని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని సంజయ్ కి లేఖ రాశారు.
పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిని పవర్ లూమ్ క్లస్టర్ కోసం సుమారు పదిసార్లు కేంద్రంలోని అనేక మంది మంత్రులను స్వయంగా కలిసినా ప్రయోజనం లేదని తెలిపారు. రెండోసారి ఎంపీ కావడంతో పాటు కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకున్న సంజయ్ సిరిసిల్ల నేతన్నలకు సేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కువ మంది బిజేపి ఎంపీలను ఎన్నుకుంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న మీ మాటలను నమ్మిన ప్రజలు బిజేపి నుంచి గెలిపించారని, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నానని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
కేటీఆర్ లేఖకు బండి సంజయ్ ఘాటుగా సమాధానం
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన బహిరంగ లేఖపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.
కేటీఆర్ అలియాస్ అజయ్ రావు…నేతన్నలు ఇన్నాళ్లకు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించింది మీరే కదా? అప్పుడు నేత కార్మికులు కనిపించలేదా… అన్నారు. సిరిసిల్లకు 15 ఏళ్లుగా ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించారు.. మరి ఎందుకు సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ హయాం నుంచి నేతన్నల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. మీరెందుకు నేతన్నలను సంక్షోభం నుండి గట్టెక్కించ లేక పోయారని అన్నారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా చేసింది మీరే కదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్క్ ను ప్రకటించినప్పుడు… మీకు సిరిసిల్ల గుర్తుకు రాలేదా.. అన్నారు.
సిరిసిల్ల నేతన్నలను సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీగా నా బాధ్యత సిరిసిల్ల నేత కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం పాటు పడుతానని బండి సంజయ్ కుమార్ తెలిపారు.
హాట్ టాపిక్ గా మారిన నేతల మాటలు..
కేటీఆర్ బహిరంగ లేఖకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు సమాధానం ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గత 10 ఏళ్ళు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో ఉండి నేత కార్మికులకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ విమర్శిస్తుంది. నేత కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే పదేళ్లు ఏం చేశారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తోడు దొంగల్లా బిజెపి బిఆర్ఎస్ కలిసి నేత కార్మికుల ఉపాధిని దెబ్బతీశారని ఆరోపించారు. అలాంటి వారు ఇప్పుడు నేత కార్మికులపై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, తమ కృషికి కేంద్ర సహకారం అందించాలని కోరారు. రాజకీయ పార్టీల నేతల మాటలు సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారాయి.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్