
Best Web Hosting Provider In India 2024

Jagtial News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఓ మహిళ ఇద్దరు కూతుళ్లతో కలిసి పారిపోయింది. మరో మహిళతో కలిసి ప్రకాశం జిల్లాలో తలదాచుకుంటూ స్వగ్రామానికి రానంటుంది. భార్య మానసిక స్థితి బాగోలేక రాకపోయినా సరే… రక్తం పంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలను అప్పగించాలని భర్త వేడుకుంటున్నాడు. భార్య బిడ్డలను తనకు అప్పగించకుంటే ఆత్మహత్యే శరణ్యమని కరీంనగర్ లో పురుగుల మందు డబ్బాతో ఆవేదనతో ఆందోళనకు దిగాడు.
ప్రేమ పెళ్లి… ముగ్గురు పిల్లలు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సురారం గ్రామానికి చెందిన జాడి మల్లేశంను మేనమరదలు భాగ్య ప్రేమించి 17 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ముగ్గురు సంతానం. శివభక్తులైన భాగ్యకు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి సూరారంలో ఉపాధి పొందే మహిళా కృష్ణవేణితో పరిచయం ఏర్పడి ఫ్రెండ్స్ గా మారారు. ఆ ఫ్రెండ్ షిప్ తో కృష్ణవేణి దేవరకొండ అంకాలమ్మ అనే మరో మహిళకు పరిచయం చేసి భాగ్యను ట్రాప్ లోకి దింపారు. ఆ మహిళా మాయలోపడి భాగ్య ఇద్దరు బిడ్డలను తీసుకుని గత ఏడాది జూన్ లో ఇంట్లో నుంచి పారిపోయింది. భార్య ఇద్దరు బిడ్డల ఆచూకీ కోసం భర్త వెతకగా చివరకు ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ముత్యాలపాడు గ్రామంలో ఉంటున్నట్లు గుర్తించారు. స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా రానుపో అంటూ భర్తపై ఆగ్రహంతో ఆందోళనకు దిగింది. పోలీసులను ఆశ్రయించిన ప్రయోజనం లేక భర్త స్వగ్రామానికి వెనుతిరిగాడు.
శివుడే నా భర్త
మహిళా మాయలో పడి తన భార్య భాగ్య ఇద్దరు బిడ్డలతో ముత్యాలపాడులో ఎరుకలవారి ఇంట్లో దుర్భర పరిస్థితిలో ఉందని భర్త మల్లేశం తెలిపారు. కొడుకుతో కలిసి పోలీసులను ఆశ్రయించి స్వగ్రామానికి తీసుకురావడానికి వెళ్లితే నీవు నా భర్తవుకాదు.. నా భర్త శివుడు అంటూ గోల చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య భక్తిభావంతో మానసిక స్థితి సరిగా లేక అలా అంది అనుకుంటే ఇద్దరు బిడ్డలు సైతం అలానే మారారని.. నీవు మా తండ్రివి కాదు.. మా తండ్రి శివుడు మా అమ్మ పార్వతి అంటున్నారని.. మాయలేడి తన భార్య ఇద్దరు బిడ్డలను మార్చేసిందని కన్నీటిపర్యంతమై మల్లేశం చెప్పారు. కృష్ణవేణి, అంకాలమ్మ మాయలో పడి భార్య ఇద్దరు బిడ్డలు మారిపోయి దుర్భర పరిస్థితిలో ఉన్నారని వారిని మాయలేడీల నుంచి కాపాడి తనకు అప్పగించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. భార్య రాకపోయినా సరే.. కనీసం యుక్తవయస్సులో ఉన్న తన బిడ్డలను అప్పగించాలని కోరుతున్నారు. లేకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమని పురుగుల మందు డబ్బాతో కరీంనగర్ కలెక్టరేట్ కు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. పోలీసులను ఆశ్రయించిన ప్రయోజనం లేదని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తన బాధను అర్థం చేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
అమ్మ కావాలి
మహిళా మాయలో పడి ఇద్దరు కూతుళ్లతో పారిపోయిన భాగ్య కొడుకు శివశంకర మనోహర్ అమ్మ కావాలని మీడియా ముందు వేడుకున్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదని… లిఫ్ట్ చేస్తే మీరు ఎవరనే విధంగా మాట్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళ మాయలో పడి అమ్మ, ఇద్దరు అక్కలు మోసపోయారని వారిని మాయలేడీల నుంచి అధికారులు రక్షించి తమకు అప్పగించాలని కోరుతున్నాడు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్