YS Sharmila : 2019లో నాతో ఎందుకు అలా ప్రచారం చేయించారు..? చర్చకు రండి – వైసీపీ నేతలకు షర్మిల సవాల్

Best Web Hosting Provider In India 2024

వైసీపీ నేతలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. 

సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని తాము అడిగితే  చంద్రబాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడి పెట్టడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే… తాము చెప్పింది ఏంటో ఒకటికి 10 సార్లు వినాలని సూచించారు.

“తల్లికి వందనం జీవో 29 క్లారిటీ లేదని, సాక్షి రాసిన వార్తకి వివరణ ఇవ్వాలని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింప జేయాలని డిమాండ్ చేశాం. ఇందులో కూటమి ప్రభుత్వానికి కొమ్ము గాసినట్లు ఎలా అవుతుంది? మేము  ప్రెస్ మీట్ పెట్టి నిలదీశాం కాబట్టే 24 గంటలు దాటకుండా సర్కారు ప్రజలకు వివరణ ఇచ్చుకుంది. ప్రతిపక్షంగా తల్లుల పక్షాన మేము నిలబడితే కాంగ్రెస్ బాబుకి తోక పార్టీ ఎలా అవుతుంది…?”అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

వైసీపీ నేతలకు బహిరంగ సవాల్….

ఇదే సమయంలో వైసీపీ నేతలకు వైఎస్ షర్మిల బహిరంగ సవాల్ విసిరారు. “2019 ఎన్నికల కంటే ముందు జగన్ గారు ఇంట్లో ఇద్దరు బిడ్డలకు ఇస్తామని చెప్పలేదా…? ఆ ముక్క పట్టుకొని నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయలేదా…? అది మీరు నిలబెట్టుకున్నారా? నిలువునా మోసం చేశారా? అది ప్రజలు మీకిచ్చిన తీర్పే చెప్తోంది. ఆ రోజు నా చేత ఊరూరా, ప్రతిచోటా ప్రచారం చేయించడం నిజం కాదా…?” అని షర్మిల సూటిగా ప్రశ్నించారు.

“నేను వైసీపీ కోసం బై బై బాబు కాంపెయిన్ చేయడం ఎంత నిజమో అమ్మ ఒడి కింద ఇద్దరు బిడ్డలకు 15000 రూపాయిలు చొప్పున, ప్రతి తల్లికి ఇస్తాం అని ప్రచారం చేయడం కూడా అంతే నిజం. మరి మీకు 15000 ప్రతిబిడ్డకు ఇచ్చే ఉద్దేశమే లేకపోతే నా చేత ఎందుకు అలా ప్రచారం చేయించారు?” అని షర్మిల నిలదీశారు.

ఇదే విషయాలపై మీరు కూడా ఎందుకు  కాంపెయిన్ చేశారని వైసీపీ నేతలను షర్మిల ప్రశ్నించారు. “సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం అని… జలయజ్ఞం పూర్తి చేస్తాం అని… ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఎందుకు కాంపెయిన్ చేయించారు? మీరు కూడా ఎందుకు కాంపెయిన్ చేశారు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా…?” అని షర్మిల సవాల్ విసిరారు.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఏపీ అధ్యక్ష బాధ్యతలను చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అంతకంటే ముందు నుంచే వైసీపీ నేతలతో పాటు సోదరుడు వైఎస్ జగన్ కు సూటిగా ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు షర్మిల. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డితో పాటు మరికొందరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మీడియాతో మాట్లాడిన షర్మిల…. వైసీపీకి రాజశేఖర్ రెడ్డికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తిలేదని వార్నింగ్ ఇచ్చారు.టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇదే తన హెచ్చరిక అన్నారు.

WhatsApp channel

టాపిక్

Ys SharmilaYsrcpYs JaganAndhra Pradesh NewsAp Politics
Source / Credits

Best Web Hosting Provider In India 2024