
Best Web Hosting Provider In India 2024

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వీ.విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫ్రిబవరి నుంచి జూన్ వరకు రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల బదిలీలను రద్దు చేసింది.
గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు హడావుడిగా ఉపాధ్యాయుల సిఫార్సు (అక్రమ) బదిలీలు చేసింది. దాదాపు 917 మంది ఉపాధ్యాయులు ఈ రకంగా తమకు నచ్చిన ప్రాంతానికి మంత్రులు, అధికారులు సిఫార్సులతో బదిలీలు అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పుడు యూటీఎఫ్, ఎస్‌టీయూతో సహా ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆందోళనలు కూడా చేశారు. ఈ బదిలీలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశాయి.
ఎన్నికల ముందు బదిలీలు చేస్తూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వారిని రిలీవ్ చేయలేదు. అయితే వివిధ దశల్లో చేసిన టీచర్ల బదిలీల్లో 653 మందికి సంబంధించిన ఫైల్‌ను రాటిఫికేషన్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు. అలాగే 917 ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన ఫైల్‌ను గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాటిఫికేషన్ చేయలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెంది, టీడీపీ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ అక్రమ బదిలీలపై స్పందించారు. ఉపాధ్యాయుల బదిలీల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. అలాగే టీచర్ల అక్రమ బదిలీలను రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రాటిఫికేషన్ ఫైలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తిరస్కరించారు. అందులో భాగంగానే బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు ముందు హడావుడిగా చేసిన ఉపాధ్యాయ అక్రమ బదిలీలను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో 215 మంది ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. తమను బదిలీ చేస్తూ ఆదేశాలు వచ్చినప్పటికీ, విధుల నుంచి రిలీవ్ చేయలేదని పేర్కొన్నారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన బదిలీలకు సంబంధించిన రాటిఫికేషన్ ఫైల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పంపింది. ఈ ఫైల్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. దీంతో 917 మంది ఉపాధ్యాయుల బదిలీ ఆగిపోయింది. తాజాగా పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు వెలువరించి స్పష్టత ఇచ్చింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆర్జేడీ, డీఈఓలకు సూచిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో 917 మంది ఉపాధ్యాయుల బదిలీలు రద్దు అవుతాయి. రాష్ట్రంలోని 2024 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగిన అన్ని ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు.
రిపోర్టింగ్ – జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్