Hyderabad Dengue Cases : హైదరాబాద్ వాసులు బీఅలర్ట్, పెరుగుతున్న డెంగ్యూ కేసులు

Best Web Hosting Provider In India 2024


Hyderabad Dengue Cases : తెలంగాణలో ఈ ఏడాది భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై డెంగ్యూ ప్రభావం ఉన్నట్లు సమాచారం. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, నిలోఫర్ లో డెంగ్యూ జ్వరాలతో వస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. డెంగ్యూ ఫీవర్ పట్ల నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఐదారు రోజులకు పరిస్థితి విషమిస్తుందని హెచ్చరిస్తున్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ నివేదిక ప్రకారం తెలంగాణలో జులైలోనే 722 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు మొత్తం 1800 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. జనవరి నుంచి జూన్ వరకు 1,078 డెంగ్యూ కేసులు నమోదవ్వగా… జులై చివరి నాటికి ఈ సంఖ్య 1,800కి పెరిగింది. వీటిలో 60 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదయ్యాయి. మిగిలిన కేసులు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రికార్డు అయ్యాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా డెంగ్యూ కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది. 2019లో 13,331 కేసులు, ఏడు మరణాలు రికార్డు కాగా, 2020లో 2,173 కేసులు, 2021లో 7,135 కేసులు. 2022లో 8,972 కేసులు, మరియు 2023లో 8,016 కేసులు, ఒక మరణం నమోదయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 60 శాతం కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ బాధితుల నుంచి ప్లేట్లెట్ కోసం అభ్యర్థనలు పెరుగుతున్నాయని బ్లెడ్ బ్యాంకుల నిర్వాహకులు తెలిపారు.

డెంగ్యూ లక్షణాలు

అకస్మాత్తుగా హై ఫీవర్ రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కంటి కదలికతో నొప్పి తీవ్రమవుతుండడం, కండరాలు, కీళ్ల నొప్పులు, రుచి, ఆకలి లేకపోవడం, ఛాతీ, శరీరంపై దద్దుర్లు, వికారం, వాంతులు, రక్తపు వాంతులు, ముక్కు, నోరు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, నిద్రలేమి, దాహం అనిపించడం, నోరు ఎండిపోవడం, పల్స్ పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

డెంగ్యూ నివారణ చర్యలు

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించేందుకు ముందు జాగ్రతలు తీసుకోవాలి. పొత్తికడుపు నొప్పి, వాంతులు, రక్తస్రావం వంటి తీవ్రమైన లక్షణాల ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇంటి లోపలకు దోమలు రాకుండా దోమ తెరలను ఉపయోగించాలి. బయట ఉన్నప్పుడు పొడవాటి దుస్తులు ధరించండి. ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.

వర్షాలు పెరిగే అవకాశం ఉందని, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. తలుపులు, కిటికీలకు దోమతెరలు అమర్చుకోవాలని, ఉదయం, సాయంత్రం దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచించింది. సెప్టిక్ ట్యాంకులను కప్పి ఉండాలని, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. ఇళ్ల చుట్టూ నిలిచిన నీటిని తొలగించడానికి వారానికోసారి “ఫ్రైడే డ్రై డే” పాటించాలని అధికారులు సూచించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsDengue FeverMonsoon Health CareHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024