
Best Web Hosting Provider In India 2024

RBI Web Series With Five Episodes: ప్రస్తుతం ఎంటర్టైన్‌మెంట్‌లో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు వస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్, హారర్, క్రైమ్, ఫాంటసీ జోనర్స్ అనే కాకుండా బయోపిక్ సినిమాలు, వెబ్ సిరీసులను ఓటీటీల ద్వారా ఆవిష్కరిస్తున్నారు.
అందుకు ఉదాహరణే స్కామ్ 1992, స్కామ్ 2003 వెబ్ సిరీసులు. ఎలాంటి కంటెంట్ అయిన ప్రజల్లోకి ఈజీగా చేర్చేందుకు ఈ ఓటీటీ సంస్థలు బాగా పనిచేస్తాయని దర్శకనిర్మాతలు భావించారు. అందుకే చరిత్రలో జరిగిన సంఘటనలు, వ్యక్తుల జీవిత చరిత్రలను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్‌తోనే తమ సేవల గురించి, విశిష్టత గురించి చెప్పేందుకు ఆర్బీఐ ఓ వెబ్ సిరీస్ తీసుకురానుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన విధులు, 90 సంవత్సరాల ప్రయాణం గురించి చాటి చెప్పేందుకు ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తోంది. అది కూడా ఐదు ఎపిసోడ్స్‌తో వెబ్ సిరీస్‌ను త్వరలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ 25-30 నిమిషాల నిడివితో దాదాపు మూడు గంటలు ఉంటుందని సమాచారం.
ఈ విషయాన్ని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. కాగా 1935లో ఏర్పాటైన ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రకటించింది. “ఆర్బీఐ 90 సంవత్సరాల ప్రయాణాన్ని గుర్తు చేసేలా జాతీయ టీవీ ఛానెల్‌లు లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లలో సుమారు 25-30 నిమిషాల నిడివి గల ఐదు ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను రూపొందించాలని బ్యాంక్ కోరుకుంటోంది” అని బిడ్‌లను ఆహ్వానిస్తూ ప్రకటించింది ఆర్బీఐ.
ఈ ఐదు ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్ ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రపై ప్రజలకు అవగాహనను పెంపొందించడానికి, ఆర్బీఐ సేవల ప్రాముఖ్యత, కార్యకలాపాలు, విధానాలపై నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించడానికి విలువైన వనరుగా ఉపయోగపడుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తి ఉన్న ప్రొడక్షన్ హౌస్‌లు, టీవీ ఛానెల్‌లు, OTT ప్లాట్‌ఫారమ్‌లు రూపొందించేందుకు ఆర్బీఐ ఆహ్వానించింది.
ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యం ఆర్బీఐ 90 సంవత్సరాల ప్రయాణంలో సంస్థ విధులు, కార్యకలాపాలకు సంబంధించి లోతైన విశ్లేషణను సమగ్రంగా ఆకర్షణీయంగా సిరీస్‌ను రూపొందించడం. అలాగే ఈ సిరీస్ సెంట్రల్ బ్యాంక్ దృక్పథం, దాని మిషన్‌ను హైలైట్ చేయాలి. ఇంకా ఆర్బీఐ ముఖ్యమైన విజయాలు, కొనసాగుతున్న అభివృద్ధి, సహకారాల గురించి తెలియజెప్పాలని ప్రకటనలో పేర్కొంది.
“బలమైన కథలు చెప్పేవారు, నిపుణుల ఇంటర్వ్యూలు, అధిక-నాణ్యత గల విజువల్స్ ద్వారా, ఆర్బీఐ పారదర్శకతను పెంచడానికి, సెంట్రల్ బ్యాంక్ కార్యకలాపాలు, విధానాలపై నమ్మకాన్ని పెంపొందించేలా వెబ్ సిరీస్ ఉండాలి” అని ఆర్బీఐ తెలిపింది.
సంక్లిష్టమైన ఆర్థిక భావనలను విస్తృత ప్రేక్షకులకు ఆసక్తికరంగా అందుబాటులోకి తీసుకురావడానికి, దాని ద్వారా ఆర్థిక అక్షరాస్యతకు దోహదపడేలా చేయడం ఈ సిరీస్ లక్ష్యం అని ఆర్బీఐ వెల్లడించింది. అలాగే ఈ వెబ్ సిరీస్ అదనంగా సెంట్రల్ బ్యాంక్‌కి విలువైన కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో వస్తుందో.. టీవీ ఛానెల్‌లో వస్తుందో చూడాలి.