
Best Web Hosting Provider In India 2024

Pepper Rice: లంచ్ బాక్స్‌లో పిల్లలకు టేస్టీగా ఉన్నవే పెట్టాలి. లేకుంటే వారు తినకుండా వస్తారు. అందుకే ఎంతోమంది తల్లులు పొటాటో రైస్, ఎగ్ రైస్, పులిహోర వంటివి పెట్టడానికి ఇష్టపడతారు. అలాంటి కోవకే చెందింది పెప్పర్ రైస్. దీన్నే మిరియాల రైస్ అని కూడా అంటారు. దీన్ని చేయడం చాలా సులువు. అన్నం మిగిలిపోతే చాలు దాంతో పెప్పర్ రైస్ ను చేయవచ్చు. దీన్ని పిల్లలకు వారానికి ఒక్కసారైనా తినిపించడం వల్ల వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పైగా దీన్ని చాలా సులువుగా చేసేయొచ్చు. ఉదయం పూట తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో లంచ్ బాక్స్ కు మిరియాల రైస్ చేసి చూడండి.
మిరియాల రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం – ఒక కప్పు
మిరియాలు – ఒక స్పూను
జీలకర్ర – అర స్పూను
నెయ్యి – రెండు స్పూన్లు
ఎండుమిర్చి – మూడు
నూనె – ఒక స్పూను
మినప్పప్పు – ఒక స్పూను
శనగపప్పు – ఒక స్పూను
పల్లీలు – గుప్పెడు
ఆవాలు – పావు స్పూను
పచ్చిమిర్చి – ఒకటి
కరివేపాకులు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
జీడిపప్పులు – గుప్పెడు
ఇంగువ – చిటికెడు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
మిరియాల రైస్ రెసిపీ
1. ముందుగానే అన్నాన్ని వండుకొని పక్కన పెట్టుకోవాలి. లేదా మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు.
2. అన్నం పొడిపొడిగా ఉంటే ఇది టేస్టీగా ఉంటుంది.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు వేసి వేయించాలి.
4. ఒక మిక్సీలో అన్నింటినీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కళాయిలో కాస్త నెయ్యి, నూనె కూడా కలిపి వేయాలి.
6. అవి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
7. తర్వాత ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పులు, పల్లీలు, ఇంగువ వేసి వేయించాలి.
8. అలాగే కరివేపాకులు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి వేయించాలి.
9. ఇవన్నీ వేగుతున్నప్పుడే ముందుగా చేసి పెట్టుకున్న పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసి వేయించుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముందుగా వండుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి.
11. అంతే టేస్టీ మిరియాల రైస్ రెడీ అయిపోతుంది. పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే రుచి అదిరిపోతుంది.
12. దీన్ని ఎలాంటి చట్నీ, కూర లేకుండా తినవచ్చు. ఏదైనా కూరతో తిన్నా కూడా టేస్టీ గానే ఉంటుంది.
13. ముఖ్యంగా మిరియాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
14. వారానికి ఒక్కసారైనా పిల్లలకు ఈ మిరియాల రైస్ తినిపించేందుకు ప్రయత్నించండి.
మిరియాల రైస్‌ను పిల్లలే కాదు పెద్దలు కూడా తినడం చాలా అవసరం. ఈ మిరియాల రైస్ వల్ల మిరియాలలోని పోషకాలన్నీ శరీరంలో చేరుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఈ మిరియాల రైస్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. అలాగే భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి కూడా మిరియాలకు ఉంది. నరాల బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు మిరియాలను తినడం చాలా ముఖ్యం. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడడానికి మిరియాలు ఎంతో సహాయపడతాయి. ఈ మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, కెరటానాయిడ్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మన ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి.
టాపిక్