Best Web Hosting Provider In India 2024
గతేడాది హాయ్ నాన్న సినిమాతో డైరెక్టర్ శౌర్యువ్ చాలా పాపులర్ అయ్యారు. తొలి మూవీతోనే సూపర్ హిట్ కొట్టారు. హాయ్ నాన్న చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన విధానం, భావోద్వేగాలను చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పించాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ రిలీజై మంచి కలెక్షన్లను దక్కించుకుంది. దీంతో శౌర్యువ్ తర్వాత ఏ మూవీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌తో శౌర్యువ్ ఓ సినిమా చేయనున్నారని, స్క్రిప్ట్ కూడా ఓకే అయిందని రూమర్లు వచ్చాయి. ఈ విషయంపై శౌర్యువ్ ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్‌తో ఆయన మాట్లాడారు.
వాస్తవం కాదు.. కానీ
జూనియర్ ఎన్టీఆర్‌తో తాను తర్వాతి సినిమా చేస్తున్నానని వస్తున్న రూమర్లలో వాస్తవం లేదని డైరెక్టర్ శౌర్యువ్ హిందుస్థాన్ టైమ్స్‌తో చెప్పారు. కానీ ఆయనతో సినిమా చేయాలని కోరిక మాత్రం తనకు ఉందని అన్నారు. “ఇది నిజం కాదు. ఈ రూమర్లు ఎక్కడ మొదలయ్యాయో కూడా తెలియడం లేదు. దురదృష్టవశాత్తు అది తప్పుడు సమాచారం. అయితే, అది నిజం కావాలని కూడా నాకు కోరికగా ఉంది. ఎప్పుడైనా సాధ్యం అవుతుందేమో” అని శౌర్యువ్ తెలిపారు.
తాను జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే ప్లాన్‍లు ఇప్పటికి లేవని, ఎప్పుడైనా అది నిజం కావాలనే ఆశ ఉందని శౌర్యువ్ స్పష్టం చేశారు. దీంతో ఈ రూమర్లకు చెక్ పడినట్టయింది.
జూనియర్ ఎన్టీఆర్‌తో రెండు భాగాలుగా ఓ యాక్షన్ డ్రామా మూవీని శౌర్యువ్ తెరకెక్కించనున్నారని ఇటీవల రిపోర్టులు వచ్చాయి. స్కిప్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రాజెక్ట్ 2026లో మొదలై.. 2028లో ఫస్ట్ పార్ట్, 2031లో రెండో భాగం రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని రూమర్లు తిరిగాయి.
హాయ్ నాన్న గురించి..
శౌర్యువ్ దర్శకత్వం వహించిన హాయ్ నాన్న సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా లీడ్ రోల్స్ చేశారు. లవ్ స్టోరీ, తండ్రీకూతుళ్ల సెంటింట్‍తో ఈ మూవీ వచ్చింది. గతేడాది డిసెంబర్ 7వ తేదీన రిలీజైన హాయ్ నాన్న పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం సుమారు రూ.76 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‍గా నిలిచింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ హాయ్ నాన్న చిత్రం భారీ సక్సెస్ అయింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఓటీటీలో చాలా కాలం టాప్-10లో ట్రెండ్ అయింది. మొత్తంగా ఓ మంచి సినిమాగా హాయ్ నాన్న నిలిచింది.
ఎన్టీఆర్ లైనప్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. కొరటాల శివ ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ దేవరపై క్రేజ్ ఉంది. బాలీవుడ్ స్టార్లు జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కూడా ఈ చిత్రం కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్నారు. దేవర చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది.
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‍తో వార్ 2 చిత్రం కూడా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీతోనే బాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తోనూ ఓ చిత్రం చేయనున్నారు ఎన్టీఆర్.