50 రోజుల్లోనే విద్యా వ్యవస్థ నిర్వీర్యం

Best Web Hosting Provider In India 2024

మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ 

టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలు అస్తవ్యస్తం

ప్రభుత్వ బడులపై ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాలు

టోఫెల్‌ శిక్షణను రద్దు చేయడం అతి హేయం

పేద విద్యార్థులకు దీని వల్ల తీరని అనర్థం

నాడు ఇంగ్లిష్‌ మీడియమ్‌నూ వ్యతిరేకించారు

కోర్టులనూ ఆశ్రయించి అడ్డుకోవాలని చూశారు

ఇప్పుడూ పేద విద్యార్థుల ఉత్తమ విద్యపై ద్వేషం

నాడు–నేడుతో గవర్నమెంట్‌ స్కూళ్లను మార్చాం

ఆ పనుల్లో అవినీతి అంటూ అసత్య ఆరోపణలు

దాన్ని కూడా ఆపాలనుకోవడం అత్యంత దుర్మార్గం

స్కూళ్లకు మేం చేసిన మంచి కనబడకూడదన్న ద్వేషం

‘అమ్మ ఒడి’ పేరు మార్చి ‘తల్లికి వందనం’ అన్నారు

ఇంట్లో పిల్లలందరికీ ఇస్తామంటూ ఊదరగొట్టారు

అధికారంలోకి వచ్చాక ఎప్పటిలా మాట తప్పారు

ఇప్పుడు ఆ పథకానికి మంగళం పాడారు

ఈ ఏడాది అమలు లేదంటూ ప్రకటించారు

అర్ధం లేని కారణాలు సాకుగా చూపుతున్నారు

దీంతో చిన్నాభిన్నం కానున్న స్కూళ్ల నిర్వహణ

ఇప్పటికే హైస్కూళ్ల నుంచి విద్యార్థుల టీసీలు

విద్యా రంగంలో హామీలన్నీ అమలు చేయాలి

లేకపోతే ప్రజల పక్షాన గట్టిగా నిలదీస్తాం

విద్యా వ్యవస్థను కచ్చితంగా కాపాడుకుంటాం

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వం గత 50 రోజుల్లో తీసుకుంటున్న అనేక నిర్ణయాలను చూస్తే.. ముఖ్యంగా విద్యా రంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. తమ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారేలా, సంస్కరణలు తీసుకొస్తే వాటిని నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఆయన ఆక్షేపించారు.
    పేద, మధ్య తరగతి పిల్లలు, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోందని, ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పారని, వాటిలో కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి తెలిపారు.
    ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం విషయానికి వస్తే.. కూటమి పార్టీలు ముందు నుంచి కూడా అందుకు వ్యతిరేకంగానే ఉన్నాయన్న ఆయన, ఆనాడు కోర్టుల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడూ వారు అదే ధోరణిలో ఉన్నారని చెప్పారు.
    పేద విద్యార్థులు కూడా ఇంగ్లిష్‌ మీద పట్టు సాధించాలని, వారు  అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్‌ నేర్చుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆలోచించిన వైయ‌స్‌ జగన్‌గారు, టోఫెల్‌ శిక్షణ ప్రవేశపెట్టారని ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయడం వల్ల.. గవర్నమెంట్‌ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. 
    తమ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తిగా మెరుగుపరిచి, కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా వాటిని అభివృద్ధి చేశామని మాజీ మంత్రి తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఆ పనులు చేయడమే కాకుండా, మెటేరియల్‌ సేకరణ కూడా రాష్ట్ర స్థాయిలో, రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పనులు కూడా ఆపాలన్న దురుద్ధేశంతో.. పనుల్లో అవినీతి జరిగిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు.
    నాడు–నేడు మనబడి కార్యక్రమంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంతో సహా అన్ని నియోజకవర్గాల్లోని 44,512 ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ఆధునీకరించామని మాజీ మంత్రి చెప్పారు. స్కూల్‌ బిల్డింగ్‌లకు అవసరమైన మరమ్మత్తులు, పెయింటింగ్స్, ప్రహరీ, ఫర్నీచర్, లైట్లు, ఫ్యాన్లు, గ్రీన్‌చాక్‌ బోర్డులు, రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్, ఇంగ్లీష్‌ ల్యాబ్, కిచెన్స్‌ ఇలా మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూల్స్‌లో సమూల మార్పులు చేశామని, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 స్కూళ్ళలో చేపట్టిన పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని 
    ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన, కార్పొరేట్‌ స్కూళ్లకు కొమ్ముకాసేలా ఉందని, ఇది గవర్నమెంట్‌ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు చాలా నష్టం చేస్తుందని స్పష్టం చేశారు.
    గవర్నమెంట్‌ స్కూళ్లలో డ్రాప్‌ అవుట్స్‌ తగ్గించడం కోసం జగన్‌గారు అమ్మ ఒడి పథకం తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం, దానికి తల్లికి వందనం అని పేరు మార్చిందని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామంటూ ఎన్నికల ముందు జోరుగా ప్రచారం చేసి, ఇప్పుడు దాన్ని అమలు చేయకుండా రకరకాల కారణాలు చెబుతున్నారని మాజీ మంత్రి ఆక్షేపించారు.
    పథకం అమలు కాకపోతే, ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌కు నిధులు లేకపోతే రిపేర్లు కష్టం అవుతాయని, దీని వల్ల పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పారు. బాత్రూమ్స్‌లో రన్నింగ్‌ వాటర్‌ ఆగిపోతే అనేకమంది విద్యార్ధులు స్కూల్స్‌కు దూరమవుతారన్న ఆయన, తాము స్కూళ్లలో డ్రాప్‌ అవుట్స్‌ తగ్గించి అడ్మిషన్లు పెంచితే, ఈ ప్రభుత్వ వైఖరి వల్ల.. మళ్ళీ విద్యార్ధులంతా ప్రేవేట్‌ స్కూల్స్‌కు వెళ్ళే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
    తల్లికి వందనం అమలు చేయకుండా.. ‘మా ప్రభుత్వంపై బురద చల్లడానికి సైంటిఫిక్‌ డేటా అవసరం లేదు. గణాంకాలు అవసరం లేదు. అదే వారు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మాత్రం డేటా అవసరమా?. అని ఆదిమూలపు సురేష్‌ సూటిగా ప్రశ్నించారు.
    ప్రస్తుత విద్యా శాఖ మంత్రి కూడా విదేశాల్లో చదువుకున్నారు కదా.. ఇంగ్లిష్‌ ప్రాధాన్యం ఆయనకూ తెలుసు కదా?. మరి అలాంటప్పుడు టోఫెల్‌ శిక్షణ రద్దు చేయడమే కాకుండా.. ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూళ్ల రద్దు పైనా ఆలోచన ఎలా చేస్తున్నారని నిలదీశారు.
    ‘పేద విద్యార్ధులు ఆత్మ విశ్వాసం, ఆత్మస్ధైర్యం పెంపొందేలా మేం కార్యక్రమం చేస్తే దాన్ని నిర్వీర్యం చేయడమే మీ లక్ష్యమా?’. అని గట్టిగా ప్రశ్నించిన ఆదిమూలపు సురేష్,  కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
    తాము ఎప్పుడూ తెలుగు బాషకు వ్యతిరేకం కాదన్న మాజీ మంత్రి, ఇంగ్లిష్‌తో పాటు, తెలుగుకూ ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించాలని, రెండిటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌సీ, ఐబీ సిలబస్‌ అమలు చేయాలని కోరారు. గవర్నమెంట్‌ స్కూళ్లను నిర్వీర్యం చేయడమే టీడీపీ లక్ష్యమన్న ఆయన, 2014–19 మధ్య వారు ఏకంగా 1785 స్కూళ్లు మూసివేశారని గుర్తు చేశారు.
    విద్యా రంగాన్ని, విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరిన ఆదిమూలపు సురేష్, తమ హయాంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యా వ్యవస్ధను తీర్చిదిద్దామని వెల్లడించారు. కార్పొరేట్‌ యూనివర్శిటీలలో కూడా పేద విద్యార్థులకు 30 సీట్లు ఉచితంగా ఇవ్వాలని చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు.
    ‘విద్యా రంగంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మేం ప్రజల పక్షాన నిలదీస్తాం. ఈ వ్యవస్ధను కాపాడుకుంటాం. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటే ప్రతిఘటన తప్పదు’.. అని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
    ‘మ్యానిఫెస్టోని మరిచిపోతే జనం కచ్చితంగా నిలదీస్తారు. కూటమి ప్రభుత్వం మ్యానిఫెస్టో అమలు చేయక తప్పదు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మేం నూటికి నూరు శాతం అమలు చేశాం. మేం ప్రజల పక్షాన నిలబడతాం. మేం అధికారంలో ఉంటే ఈపాటికి అమ్మ ఒడి వచ్చేది కదా అని అందరూ అనుకుంటున్నారు. మా పార్టీ పేదల పక్షమే, ప్రజలే అంతిమ నిర్ణేతలు’.. అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.

Best Web Hosting Provider In India 2024