Best Web Hosting Provider In India 2024
Nagarjuna Sagar project : ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీశైలం నుంచి భారీగా నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ కూడా త్వరలోనే నిండిపోనుంది. ఇవాళ్టి(ఆగస్టు 1) మధ్యాహ్నం రిపోర్ట్ ప్రకారం… 533 అడుగుల నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 169.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఇన్ ఫ్లో 2,08,917 క్యూసెకులుగా నమోదు కాగా… 8,344 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 103.71 అడుగుల నీటిమట్టం ఉంది. 1.11 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 185 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరనుంది.
రేపు సాగర్ నుంచి నీటి విడుదల
రేపు సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటి విడుదల చేయనున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ లో సాగర్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ నుంచి నీటి విడుదల చేయనున్నారు.
శ్రీశైలంలో కొనసాగుతున్న వరద ఉధృతి…
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,42,026 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,78,172 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరింది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు గురువారం శ్రీశైలంలోని మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో ప్రదక్షణలు చేసి అనంతపరం మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రిగా శ్రీశైలం తొలిసారి వచ్చిన బాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. చంద్రబాబు నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
NOTE : ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గణాంకాలు మారుతుంటాయి. ఆ వివరాలను https://apwrims.ap.gov.in/mis/reservoir/ లింక్ పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చు
టాపిక్