Best Web Hosting Provider In India 2024
మెదక్ జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. మనోహరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న కంటైనర్ వెనక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఏడు నెలల గర్భిణీ మృతి చెందగా.. ఆమె గర్భంలో ఉన్న శిశువు రోడ్డుపై పడి కన్ను మూసింది. ఈ ఘటన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం…. మనోహరాబాద్ మండల కేంద్రంలోని 44 వ జాతీయ రహదారిపై వెళ్తున్న బైక్ ను తూప్రాన్ నుండి వేగంగా వస్తున్న కంటైనర్ వెనక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వారంతా కిందపడగా, గర్భిణీ అయిన మహిళ శరీరంపై నుండి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గర్భిణీ అక్కడికక్కడే మృతి చెందగా,ఆమె గర్భంలోని శిశువు రహదారిపై పడి కన్నుమూసింది. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలవ్వగా .. వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. కాగా ఘటన స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు సిద్దిపేట జిల్లాకు చెందిన పనేటి రేణగా పోలీసులు గుర్తించారు.
వివరాలు….
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన పనేటి రేణ ( 28) పోషయ్య దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా పోషయ్య ఇద్దరు పిల్లలను చూసుకుంటూ, గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూలీపనులు చేయగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో రేణ జీవనోపాధి కోసం ఊరూరా తిరుగుతూ బ్యాగులకు జిప్పులు పెడుతూ జీవనం సాగించేది.
ఈ క్రమంలో రేణ బుధవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి, మరో బాబుతో కలిసి బైక్ పై మేడ్చల్ వైపు 44 వ జాతీయ రహదారిపై వెళ్తున్నారు. ఈ క్రమంలో తూప్రాన్ నుండి అతి వేగంగా వస్తున్న లారీ వెనక నుండి బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ ఫై వెళ్తున్న వారు కిందపడిపోయారు. వెనకాల కూర్చున్న రేణ శరీరంపై నుండి లారీ టైర్ వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. ఆమె కడుపులో ఉన్న ఏడు నెలల శిశువు రోడ్డుపై పడి లోకాన్ని చూడకుండానే కన్నుమూసింది.
బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు బాబుకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరగ్గానే బైక్ నడపుతున్న వ్యక్తి .. బాబుని తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. బైక్ నడిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనలో తల్లి, గర్భస్థ శిశువు మృతి చెందడంతో మల్లుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రేణ,పోషయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. పేదరికంలో ఉండటంతో పిల్లలని పోషించే ఆర్ధిక స్థోమత లేక గతంలో ఒక శిశువును దత్తతకు ఇచ్చారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో దత్తతకు ఇచ్చిన బాబుని శిశు సంరక్షణకు తరలించారు. ఆ తర్వాత తల్లితండ్రులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి…. అనంతరం మరల బాబుని అప్పగించినట్లు తెలిసింది.
రిపోర్టింగ్ – ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హెచ్ టీ తెలుగు.
టాపిక్