Best Web Hosting Provider In India 2024
Healthy Sweet Recipe: ప్రోటీన్ తో నిండిన స్వీట్లు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అలా ప్రోటీన్తో నిండిన స్వీట్ రెసిపీ ఒకటి ఇచ్చాము. అది పుట్నాల పప్పుతో చేసే స్వీట్. దీనిలో బెల్లం, పుట్నాలు పప్పు వాడతాం కాబట్టి… ప్రోటీన్, ఐరన్ అధికంగా లభిస్తుంది. పిల్లలకు సాయంత్రం పూట ఈ స్వీట్‌ని తినిపించడం వల్ల వారికి ఐరన్ లోపం లేదా ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
పుట్నాల పప్పు బెల్లం స్వీట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పుట్నాల పప్పు – ఒక కప్పు
బెల్లం తురుము – ఒక కప్పు
నీళ్లు – సరిపడినన్ని
కొబ్బరి తురుము – పావు కప్పు
నెయ్యి – ఒక స్పూన్
యాలకుల పొడి – అర స్పూను
పుట్నాల పప్పు బెల్లం స్వీట్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
2. అందులో పుట్నాల పప్పును, కొబ్బరి తురుమును వేసి వేయించండి. చిన్న మంటపై ఇలా వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
3. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అందులోనే యాలకుల పొడిని కూడా కలుపుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో బెల్లం తురుము, నీళ్లు వేసి వేడి చేయాలి.
5. బెల్లం కరిగాక ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇది హల్వాలాగా దగ్గరగా అయ్యేవరకు ఉంచుకోవాలి.
7. కావాలంటే నెయ్యిని మరి కొంచెం తీసుకోవచ్చు.
8. ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసి దానిపై ఈ మొత్తం మిశ్రమాన్ని వేయాలి.
9. చల్లారే వరకు ఉంచి తర్వాత బర్ఫీల్లా ముక్కలుగా కోసుకోవాలి.
10. అంతే టేస్టీ పుట్నాల పప్పు స్వీట్ రెడీ అయినట్టే.
11. దీన్ని చేయడం చాలా సులువు. అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. పైగా ఎన్నో పోషకాలను అందిస్తుంది.
బెల్లం తినడం వల్ల ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. ప్రతిరోజు పిల్లలకు ఒక పుట్నాల పప్పు స్వీటు అందిస్తే చాలు, శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. అలాగే పుట్నాల పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఈ పోషకం కూడా పుష్కలంగా అందుతుంది. సాయంత్రం పూట జంక్ ఫుడ్ లకు, చాక్లెట్లకు అలవాటు చేసే బదులు ఇలాంటి హెల్తీ స్వీట్లను అలవాటు చేయడం మంచిది.
టాపిక్