Best Web Hosting Provider In India 2024
Sircilla district Crime News : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుక్కల దాడిలో గడిచిన నెల రోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ముస్తాబాద్ మండలం బట్టువానితండాలో కదలలేని స్థితిలో వయో వృద్ధురాలు పిట్ల రాజలచ్చవ్వ బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న ఓ కుక్క దాడి చేసింది. వృద్దురాలి ప్రాణం తీసింది.
వృద్ధురాలు నిద్రిస్తున్న రూమ్ కు డోర్ సరిగా లేకపోవడంతో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కుక్క ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేసి తల, చేయి కొరికేసింది. కుక్క దాడితో వృద్ధురాలి తల మొండెం వేరు అవ్వగా తల పూర్తిగా కుక్క తినేసింది. కదలలేని స్థితిలో వృద్ధురాలు మంచం పక్కనే కుక్క పడుకుంది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు వృద్ధురాలు నిద్రలేపేందుకు ప్రయత్నించగా తల కొరికేసి రక్తం మడుగులో బీభత్సంగా ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. వృద్దురాలను కొరికి చంపేసిన కుక్క మాంసం ముద్దలు కక్కుతూ పక్కనే పడుకోవడంతో ఆ కుక్కనే వృద్దురాలి ప్రాణం తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలతో కుక్క కొట్టి చంపేశారు.
కుక్కకు ఆహారంగా మారిన వృద్ధురాలు…!
కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాలకు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వ్యవసాయ పనులు వరినాట్లతో బిజీగా ఉన్న కొడుకులు కోడళ్ళు ఆదమరిచి రాత్రి నిద్రపోగా తెల్లవారే సరికి ఈ దారుణం జరిగింది. పని బిజీలో కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైన వృద్ధురాలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. నాన్ వెజ్ కు అలవాటు పడ్డ కుక్కలు వృద్ధురాలు పై దాడి చేశాయని, కుక్కలను నిర్మూలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దారుణ ఘటన జరిగిన తండాలో 30 వరకు కుక్కలు ఉన్నాయని వాటిని నిర్మూలించాలని గ్రామస్థులు కోరారు.
పదుల సంఖ్యలో బాధితులు…
కుక్కలు దాడిలో గాయపడ్డ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చాలామంది కుక్కల బారిన పడి గాయపడి ఆసుపత్రిలో చేరుతున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 50 నుంచి 60 మంది కుక్కకాటుకు గురైన బాధితులు వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. నిన్న ఒక్కరోజే 52 మంది కుక్క కాటుకు గురైన బాధితులు కరీంనగర్ ఆసుపత్రిలో డాక్ బైట్స్ తీసుకున్నారు. కుక్కల బెడదతో వేగలేకపోతున్నామని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కలను నివారించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
టాపిక్