Best Web Hosting Provider In India 2024
Malayalam Star Heroes: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడి 277 మంది చనిపోయిన విషాద ఘటనపై మలయాళం స్టార్ హీరోలు పెద్ద మనసుతో స్పందించారు. అక్కడి మెగాస్టార్ మమ్ముట్టి, అతని కొడుకు, మరో స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, అతని భార్య నజ్రియా, తమిళ హీరో విక్రమ్ లాంటి వాళ్లు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద మొత్తం ఇచ్చారు.
మలయాళం రియల్ హీరోలు
వయనాడ్ విపత్తుతో ఏకంగా 277 మంది మరణించగా.. 200కుపైగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన దేశం మొత్తాన్ని కలిచి వేసింది. దీనిపై మలయాళ హీరోలు కూడా స్పందించి తమ వంతు సాయం అందించారు. అక్కడి స్టార్ హీరో మమ్ముట్టి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు ఇచ్చాడు. ఇక అతని తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్ కూడా రూ.15 లక్షలు అందించాడు.
అంతేకాదు మమ్ముట్టికి చెందిన చారిటబుల్ ట్రస్ట్ ఓవైపు ఈ విపత్తు బాధితులకు తమ వంతు సాయం చేస్తూనే ఉంది. వాళ్లకు కావాల్సిన నిత్యావసరాలు ఆహారం, మందులు, బట్టలు వంటివి అందిస్తోంది. అటు మరో మలయాళం హీరో ఫహాద్ ఫాజిల్, అతని భార్య నజ్రియా నజీమ్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు ఇవ్వడం విశేషం.
ఈ విషయాన్ని ఫహాద్ టీమ్ వెల్లడించింది. “సహాయ, పునరావాస పనుల కోసం మా వంతుగా రూ.25 లక్షలు అందజేస్తున్నాము. ఇది బాధితులకు ఎంతో కొంత సాయం చేస్తుందని ఆశిస్తున్నాము” అని ఫహాద్ టీమ్ ఒక ప్రకటనలో తెలిపింది.
తమిళ స్టార్లు కూడా..
మలయాళ స్టార్లే కాదు.. తమిళ స్టార్లు కూడా ఈ క్లిష్ట సమయంలో వయనాడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఆ ఇండస్ట్రీ నటుడు విక్రమ్ తన వంతుగా రూ.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చాడు. ఇక సూర్య, జ్యోతిక, కార్తీ ముగ్గురూ కలిసి రూ.50 లక్షలు అందజేశారు. నటి రష్మిక రూ.10 లక్షలు ఇచ్చింది.
కేరళలోని వయనాడ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడిన విషయం తెలిసిందే. ఈ ఊహించని విపత్తులో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. మరిన్ని వందల మంది గాయపడ్డారు. ఎంతో మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే 1500 మందికిపైగా ప్రజలను సహాయ సిబ్బంది రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
టాపిక్