Best Web Hosting Provider In India 2024
ఎట్టకేలకు గౌరవెల్లి ప్రాజెక్టుకు మోక్షం లభించింది. గత 16 ఏళ్ళుగా మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా సాగిన గౌరవెల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర క్యాబినెట్ 437 కోట్లు కేటాయిస్తూ ఆమోదించింది. వేగవంతంగా పనులు పూర్తిచేసి మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్యాబినెట్ నిర్ణయం, మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ నెరవేరుతున్న తరుణంలో సర్వత హర్షం వ్యక్తం అవుతుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రాధాన్యత గల గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రధాన కాలువల భూసేకరణ అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే పనులు పూర్తి చేసుకొని హుస్నాబాద్ తో పాటు పాటు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లో బీడు భూములకు గోదావరి జలాలు తరలివచ్చి మెట్ట ప్రాంతం పాడిపంటలతో సస్యశ్యామలం కానున్నాయి.
గౌరవెల్లి ప్రాజెక్ట్ తో పాటు ఎస్ఆర్ఎస్పీ – ఐఎఫ్ఎఫ్సి లోని ప్యాకేజీ నంబర్ -7 లోని పెండింగ్ పనుల పూర్తి చేయడానికి రూ 437 కోట్ల రూపాయలు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సవరించిన అంచనా ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తయితే లక్షా ఆరు వేల (1,06,000 )ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో 57,852 ఎకరాలు ,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 48,148 ఎకరాలకు సాగునీరు అందనుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ఉన్న రెండు ప్రధాన కాలువల్లో కుడి కాలువ ద్వారా 90,000 ఎకరాలు , ఎడమ కాలువ ద్వారా 16 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
నత్తనడకన పనులు…!
గౌరవెల్లి ప్రాజెక్ట్ గత గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీంతో పనులు నత్తనడకన సాగాయి. దీని తరువాత శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇక్కడ రైతులకు నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
గౌరవెల్లి ప్రాజెక్ట్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. 2007 జూలై 13న ప్రాజెక్ట్ ను ఎస్ఆర్ఎస్పీ రెండవ దశ లో వరద కాలువ ప్రాజెక్ట్ కింద రూ.913.15 కోట్ల రూపాయల తో పనులు చేపట్టడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. సంబంధిత రిజర్వాయర్ కాలువ పనులు చేపట్టడానికి ప్యాకేజీ -7 లో రూ. 278.58 కోట్ల రూపాయలను సమకూర్చింది. ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన భూమి – 3919 ఎకరాలు కాగా ,సేకరించిన భూమి 1676 ఎకరాలు , సేకరించవలిసిన మిగులు భూమి 2243 ఎకరాలు గా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో సిడి అండ్ సిఎం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కేటాయించిన నిధులతో పనుల్లో వేగం పుంజుకోనుంది.
పంతం నెగ్గించుకున్న మంత్రి…!
రాష్ట్ర మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్ట్ ల లిస్ట్ లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ను చేర్చి త్వరితగతిన పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. తన కమిట్మెంట్ ను నిరూపించేందుకు విశ్వప్రయత్నం చేసి సక్సెస్ కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
గతంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై 2023 మార్చి 2న పొన్నం ప్రభాకర్ తో కలిసి పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ను సందర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రాజెక్ట్ ను సందర్శించినప్పుడు కుర్చివేసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ప్రారంభించింది కాంగ్రెస్ అని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ అని ఆరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పురోగతి పై మంత్రి పొన్నం ప్రభాకర్ నిత్యం వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచారు. అందులో భాగంగా హుస్నాబాద్ లో కరీంనగర్ సిద్దిపేట, హన్మకొండ జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు భూసేకరణ పై రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో చర్చలు జరిపారు. గౌరవెళ్లి ప్రాజెక్ట్ కాలువల నిర్మాణానికి వేగవంతంగా భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. క్యాబినెట్ లో పలు సందర్భాల్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ అవసరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్ట్ అవసరాలను వివరించారు.
ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించేలా డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వద్ద గౌరవెల్లి ప్రాజెక్ట్ పై వివరణ ఇచ్చి నిధులు కేటాయించేలా చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతామని క్యాబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో హుస్నాబాద్ లో హర్షతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇంతపెద్ద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర క్యాబినెట్ మంత్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
త్వరలోనే నీళ్లు – మంత్రి పొన్నం
త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని నెర్రెలు బారిన పొరుగడ్డ హుస్నాబాద్ నియోజకవర్గంలో గోదావరి నీళ్ళు చేరి పాడి పంటలతో సస్యశ్యామలం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన జీవిత ఆశయం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు గౌరవెల్లి ద్వారా నీళ్ళు అందించడమే లక్ష్యమని ప్రకటించారు. ఆశయ సాధన కోసం నిరంతరాయంగా పని చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
టాపిక్