Best Web Hosting Provider In India 2024
Friday Motivation: స్వామి వివేకానంద పేరు చెబితేనే యువతలో రక్తం ఉరకలెత్తుతుంది. ఆయన బోధనలు కూడా అంతే స్ఫూర్తివంతంగా ఉంటాయి. స్వామి వివేకానంద పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ విజయం సాధించేందుకు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. స్వీయ అభివృద్ధికి, స్వీయ క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి ఏ పిల్లలైతే క్రమశిక్షణతో ఎదుగుతారో యువతగా మారాక వారే విజయాన్ని సాధిస్తారని కూడా వివరించారు. ఎలాంటి పిల్లలు విజయాన్ని సాధించే అవకాశం ఉందో… విజయం సాధించేందుకు ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆయన వివరించారు.
స్వీయ నియంత్రణ
స్వామి వివేకానంద తరచూ చెప్పినది స్వీయ నియంత్రణ గురించి. ఎవరికైతే ఈ శక్తి ఉంటుందో వారు తప్పకుండా జీవితంలో ఏదో ఒకటి సాధించి తీరుతారు. ప్రేరణకు గురికాకుండా కోరికలను అదుపులో ఉంచుకునే సామర్థ్యం ఉంటే చాలు, ఆ వ్యక్తి తాను అనుకున్నది సాధించడానికి ముందుకే సాగుతాడు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, లక్ష్యాలపై దృష్టి పెట్టడం, పరధ్యానాన్ని నిరోధించడం, స్వీయ నియంత్రణలో ముఖ్యమైనవి. వాయిదా వేయడానికి పూర్తిగా మానేయాలి. వివేకానంద బోధనలో నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకోవడంతో పాటు వాటిని సాధించేందుకు షెడ్యూల్ ప్రకారం వెళ్ళమని సూచిస్తాయి. స్వీయ క్రమశిక్షణను అభ్యసించమని ప్రోత్సహిస్తాయి.
కృషి
విజయమైన కృషితోనే సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద చెప్పిన ప్రకారం కేవలం కోరిక ఉంటే సరిపోదు, ఆలోచనల నుండి విజయం సాధించేందుకు కావలసిన అంశాలు కూడా రావాలి. పట్టుదలతో కూడిన ప్రయత్నం ఉండాలని వివరిస్తారు. విద్య, క్రీడలు, వ్యాపారాలు లక్ష్యం ఏదైనా కావచ్చు. కానీ దానికి తగినట్టుగా పనిచేయడం కూడా ఎంతో ముఖ్యం. కష్టపడకుండా ఒకే చోట కూర్చొని విజయాన్ని సాధించడం అసాధ్యం అన్నది వివేకానంద అభిప్రాయం.
సరైన దినచర్య
జీవితం ఒక పద్ధతిలో సక్రమంగా సాగాలంటే దినచర్య కూడా అంతే సక్రమంగా ఉండాలన్నది స్వామి వివేకానంద ఉద్దేశం. వ్యక్తిగత అభివృద్ధి, స్వీయ క్రమశిక్షణ వంటివన్నీ నిర్మాణాత్మక రోజువారీ దినచర్యలతోనే వస్తాయని అతను నమ్మారు. ఇది రొటీన్ గా అనిపించవచ్చు… కానీ ఆ రొటీన్ జీవితమే మనిషిని మంచిదారిలోకి నడిపిస్తుంది. చదువుకోవడానికి, ఆడుకోవడానికి, కుటుంబంతో గడపడానికి అన్నిటికీ ఒక నిర్ధిష్ట సమయాలను కేటాయించుకోవాలి. అలాగే విశ్రాంతి తీసుకోవడానికి ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తక్కువగా పడుతుంది.
స్వీయ గౌరవం
స్వామి వివేకానంద చెప్పిన వాటిలో ముఖ్యమైనది ఆత్మగౌరవం, స్వీయ విలువ. అంటే మనల్ని మనం ముందుగా గౌరవించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనకోసం సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించడం సులువుగా మారుతుంది. పిల్లలకు కూడా ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి స్వీయ గౌరవాన్ని నేర్చుకున్న పిల్లలు పెద్దయ్యాక కూడా ఒక పద్ధతిలో జీవించేందుకు ఇష్టపడతారు.
సంకల్ప శక్తి
స్వామి వివేకానంద సంకల్ప శక్తిని, సానుకూల మనస్తత్వాన్ని కూడా విజయంలో భాగం చేశారు. క్రమశిక్షణతో కూడిన మనస్సు ఏ అడ్డంకులు వచ్చినా ఏకాగ్రతను విడిచిపెట్టదు. సంకల్పశక్తిని కూడా పెంచుతుంది. కొత్త నైపుణ్యం లేదా కొత్త సబ్జెక్టును నేర్చుకునేటప్పుడు అది నేర్చుకోవాలన్న సంకల్ప శక్తిని కలిగి ఉండాలి. ఎలాంటి సవాళ్లు ఎదురైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా ఉండాలి. దీనికి బలమైన సంకల్ప శక్తితో పాటు ప్రతి విషయాన్ని స్వీకరించే సానుకూల మనస్తత్వం కూడా అవసరం.