Best Web Hosting Provider In India 2024
Average Student Nani Review: పవన్ కొత్తూరి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్నేహ, సాహిబా బాసిన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు. ఈ బోల్డ్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
నాని చదువులో యావరేజ్…
నాని (పవన్ కొత్తూరి) చదువులో యావరేజ్. కొడుకును ఇంజినీర్ చేయాలని నాని తండ్రి (రాజీవ్ కనకాల) కలలు కంటాడు. కానీ ఎంసెట్‌లో క్వాలిఫై కాకపోవడంతో తండ్రి చేతిలో నాని ఎప్పుడు తిట్లు తింటుంటాడు. తల్లి (ఝాన్సీ) కష్టాలు పడి ఓ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో నానికి సీటు సంపాదిస్తుంది. నానికి అక్క రేణు ఉంటుంది. తమ్ముడితో ఎప్పుడు రేణు గొడవలు పడుతుంది.
కానీ ఎదుటివారు తమ్ముడిని ఒక్క మాట అన్న రేణు సహించదు. నాని చదువును పక్కనపెట్టి స్నేహితులతో కలిసి కాలేజీ లైఫ్‌ను ఎంజాయ్‌చేస్తుంటాడు. ఈ క్రమంలో కాలేజీలో సీనియర్ అయిన సారాతో (స్నేహ) నాని ప్రేమలో పడతాడు. సారా కూడా నానిని ఇష్టపడుతుంది. సారాను ప్రేమిస్తోన్న లక్కీ…నానిపై పగను పెంచుకుంటాడు. అతడితో గొడవ పడతాడు. అమెరికా వెళ్లిన నాని అక్కపై ఎటాక్ జరుగుతోంది. ఆ ప్రమాదంలో గాయపడిన ఆమె కోమాలోకి వెళ్లిపోతుంది. అదే టైమ్‌లో మనస్పర్థల కారణంగా నానికి సారా బ్రేకప్ చెబుతోంది.
నాని, సారా విడిపోవడానికి కారణం ఏమిటి? నాని అక్కపై ఎటాక్ చేసింది ఎవరు? అక్కను ద్వేషించే నాని ఆమె మంచితనాన్ని ఎలా తెలుసుకున్నాడు? తండ్రి మెప్పును పొందడం కోసం యావరేజ్ స్టూడెంట్ అయిన నాని ఏం చేశాడు? నాని లైఫ్‌లోకి వచ్చిన మరో జూనియర్ అమ్మాయి (సాహిబా బాసిన్) ఎవరు? ఇద్దరిలో నాని ఎవరిని ప్రేమించాడు అన్నదే ఈ మూవీ కథ.
యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్…
యూత్‌ఫుల్ లవ్‌స్టోరీస్ తెలుగు తెరకు కొత్తమీ కాదు. అయితే ఇది వరకు యువతరం ప్రేమకథలను స్వచ్ఛంగా చూపించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటి ఆడియెన్స్ అభిరుచులకు తగ్గట్లుగా బోల్డ్, గ్లామర్ అంశాలతో ఈ కథలను చెబుతోన్నారు నేటి దర్శకులు. యావరేజ్ స్టూడెంట్ నానితో దర్శకుడు పవన్ కొత్తూరి అదే ప్రయత్నం చేశారు.
మిడిల్ క్లాస్ కుర్రాడి కథ…
చదువులోనే యావరేజ్ అయిన ఓ మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితం చోటుచేసుకునే డ్రామాతో ఈ మూవీని తెరకెక్కించాడు. ఫ్యామిలీ, ప్రేమ పరంగా తనకు ఎదురైన అడ్డంకులను అతడు ఎలా దాటుకున్నాడు? బరువు బాధ్యతలు లేకుండా జాలీగా జీవితాన్ని వెళ్లదీసే అతడు ఎలా మారిపోయాడన్నది ఎమోషన్స్, కామెడీ కలగలిపి ఈ మూవీలో చూపించాడు.
లిప్‌లాక్‌లు…
నాని ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో ఫన్నీగా ఈ మూవీ మొదలవుతుంది. బీటెక్‌లో సీటు రాక తండ్రి చేత నాని తిట్లు తినే సీన్స్ నవ్వులను పంచుతాయి. ఆ తర్వాత నాని ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ కావడం,
ర్యాగింగ్ ఎపిసోడ్స్, సీనియర్ హీరోయిన్‌తో ప్రేమాయణం, గొడవలు లాంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీని బోల్డ్, లిప్‌లాక్‌లు గట్టిగానే ఉండేలా చూసుకున్నారు. సాఫీగా సాగిపోతున్న నాని జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాన్నది సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా డైరెక్టర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. తండ్రి బాధను నాని ఎలా అర్థం చేసుకున్నాడు?
అక్క రేణు ఎలా కాపాడుకున్నాడనే సీన్స్‌లో సెంటిమెంట్ కొంత వర్కవుట్ అయ్యింది. చివరకు తండ్రి గర్వపడే స్థాయికి నాని చేరుకున్నాడా లేదా అనే ఫ్యామిలీ బాండింగ్ సీన్స్‌తో పాటు ట్రయాంగిల్ లవ్‌స్టోరీని రన్ చేస్తూ చివరలో ఓ చిన్న సర్‌ప్రైజ్‌తో సినిమాను ఎండ్ చేయడం బాగుంది.
కామెడీ మిస్
రొటీన్ స్టోరీలైన్ యావరేజ్ స్టూడెంట్ నానికి మైనస్‌గా నిలిచింది. ఫస్ట్ హాఫ్‌లో నాని ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ నవ్వించిన కాలేజీ ఎపిసోడ్స్‌లో కామెడీ తేలిపోయింది. నానిలో మార్పు వచ్చే సీన్స్‌ను మరికొంత డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.
హీరో, డైరెక్టర్ ఒక్కరే…
ఈ సినిమాకు హీరో, డైరెక్టర్ రెండు బాధ్యతల్ని పవన్ కొత్తూరి చేపట్టారు. తాను రాసుకున్న పాత్ర కావడంతో నాని క్యారెక్టర్‌ను ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్లు స్నేహ, సాహిబా బాసిన్ గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో రాజీవ్ కనకాల, ఝాన్సీ పాత్రలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. కొడుకు బాగు కోసం తాపత్రయపడే తల్లిదండ్రులుగా మెప్పించారు.
బోల్డ్ లవ్‌స్టోరీ…
యావరేజ్ స్టూడెంట్ నాని బోల్డ్ లవ్‌స్టోరీ. యూత్ ఆడియెన్స్‌ను ఈ మూవీ కొంత వరకు మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5