Best Web Hosting Provider In India 2024
Visakhapatnam News : విశాఖపట్నం జిల్లాలో కూతురిపైనే కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్న కుమార్తెను గర్భిణీని చేసిన ఆ తండ్రికి జీవిత కాల జైలు శిక్ష పడింది. విశాఖపట్నం పోక్సో స్పెషల్ కోర్టు… జీవిత కాల జైలు శిక్షతో పాటు, రూ.30 వేలు జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి నిందితుడు రూ. ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, మరో రూ.ఐదు లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని పోక్సో కోర్టు గురువారం ఆదేశించింది.
విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో వృత్తి రీత్యా ఎలక్ట్రికల్ ఇంజినీరు నివాసం ఉంటున్నాడు. కానీ ఆయన పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో పని చేసేవాడు. 2004లో ఆయనకు వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే 2016లో భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. దీంతో కుమార్తెను విశాఖపట్నంలోనే తాత, నానమ్మ (తండ్రికి అమ్మ, నాన్న) వద్ద ఉంచాడు. కుమార్తె అక్కడే ఉండి చదువుకుంటుంది.
ఉద్యోగం రీత్యా ఇతర ప్రదేశాలకు ఆయన వెళ్లేవాడు. పనులు ముగించుకుని శని, ఆదివారాల్లో విశాఖపట్నం వచ్చేవాడు. అప్పుడే కుమార్తెపై కన్నేశాడు. సదరు తండ్రి కన్న కుమార్తెను లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. 2020 ఫిబ్రవరి నుంచి పలుమార్లు కుమార్తెపై శారీరకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. తండ్రి బెదిరింపులకు భయపడి ఎవరికీ చెప్పలేదు. దీంతో ఈ విషయం బయటపడలేదు.
అయితే తనకు కడుపు నొప్పి వస్తుందని తండ్రికి పలుమార్లు చెబితే, గర్భవిచ్ఛిత్తికు మందులు ఇచ్చేవాడు. ఇలా చేయడంతో కాలం గడిపేవాడు. భయపడి కుమార్తె ఎవ్వరికీ చెప్పలేకపోయింది. అయితే తండ్రి ఇంట్లో లేనప్పుడు కుమార్తెకు అనారోగ్యం వచ్చింది. దీంతో తాత, నానమ్మ మనవరాలను విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పుడు వైద్యలు పరీక్షలు నిర్వహించి ఆ బాలిక గర్భం దాల్చిందని నిర్ధారించారు.
మనవరాలు గర్భదాల్చిన విషయాన్ని వైద్యులు నానమ్మకు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక, ఆమె బాలికను గర్భం ఎలా వచ్చిందని ప్రశ్నించింది. ఆ బాలిక ఏమీ చెప్పలేదు. చెప్పాలని ఉన్నా… తండ్రి బెదిరింపులతో భయపడి ఉండటంతో చెప్పలేకపోయింది.
తాత, నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కన్న తండ్రేనని తేల్చారు. దీంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్థుడికి జీవితకాల శిక్షను న్యాయమూర్తి విధించారని పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్