Best Web Hosting Provider In India 2024
Varun Sandesh About His Wife Vithika Sheru: శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన హ్యాపీడేస్ సినిమాతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత అనేక చిత్రాలు చేసినప్పటికీ ఆ క్రేజ్ అంతగా కొనసాగించలేదు. ఈ మధ్య కాలంలో హీరోగానే కాకుండా విలన్‌గా యాక్టర్‌గా చేస్తూ అలరిస్తున్నాడు.
అయితే, వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా విరాజీ. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. ఆగస్ట్ 2న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న వరుణ్ సందేశ్ విరాజీకి సంబంధించిన ఆసక్తికర విశేషాలు చెప్పాడు. అలాగే తన భార్య వితికా శేరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
– మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మా విరాజీ మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఫస్ట్ వాళ్లను నేనే అప్రోచ్ అయ్యాను. మంచి మూవీ చూడమని చెప్పాను. వాళ్లు చూసి మేము రిలీజ్ చేస్తామని ముందుకొచ్చారు.
– ఇవాళ ప్రేక్షకులు సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనం ఉన్న సినిమా విరాజీ. ఈ కథ చెప్పేటప్పుడే దర్శకుడు ఆద్యంత్ హర్ష చాలా డీటెయిల్డ్‌గా బీజీఎం రిఫరెన్స్‌లతో చెప్పాడు. సినిమాను అంతే పర్పెక్ట్ ప్లానింగ్‌తో రూపొందించాడు. ఏ సీన్లో ఏం ఏం అవసరమో అవన్నీ పేపర్ మీద వర్క్ చేసి పక్కాగా ఉండేలా చూసుకున్నాడు.
– ఈ వారం ఓ పదీ పన్నెండు సినిమాలు రిలీజ్‌కు వస్తున్నాయి. వాటిలో మా విరాజీ మూవీ కనిపిస్తుందంటే దానికి మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల గారు చేయిస్తున్న ప్రమోషనే కారణం. ఆయనకు సినిమా పట్ల ప్యాషన్ ఉంది. ఈ కథను అలాంటి ప్రొడ్యూసర్ మాత్రమే నిర్మించగలరు.
– కథ బాగుండి, క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మంచి స్టోరీ ఉంటే వెబ్ సిరీస్‌ల్లోనూ నటించాలని ఉంది. మైఖేల్ సినిమాలో విలన్‌గా కనిపించాను. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనే పరిమితులు ఏవీ లేవు. విరాజీ ఒక మంచి సినిమా. దీనికి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా.
– నా గురించి, నా సినిమాల గురించి, నా కెరీర్ గురించి ఎవరైనా ఏదైనా అంటే నేను భరిస్తాను. నటుడిగా నా కెరీర్లో విమర్శలు కూడా ఒక భాగం. కానీ, నా వైఫ్ వితిక ఫైర్ బ్రాండ్. అందుకే తను నా కెరీర్ గురించి స్పందిస్తూ మాట్లాడింది. వితిక లాంటి భార్య ఉండటం నా అదృష్టం.
-18 ఏళ్లప్పుడు హ్యాపీడేస్ చేశాను. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా ఎక్సీపిరియన్స్లు చూశాను. అందుకే మరొకరి అభిప్రాయాల పట్ల స్పందించను. ప్రతి ఒక్కరికీ ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. ఈ మూవీ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎబనెజర్ పాల్ విరాజీకి అద్భుతమైన బీజీఎం ఇచ్చాడు. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆయన ఇప్పుడు మరో మూడు బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ సైన్ చేశాడు.