Best Web Hosting Provider In India 2024
ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నకారణంగా గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
త్వరలో ప్రారంభమయ్యే సీఐడీ విచారణకు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఊహించని స్థాయిలో 5 ఏళ్లలో మద్యంలో అక్రమాలు జరిగాయని…దీనిపై అన్ని లావాదేవీలు సీఐడీకి అందించాలన్నారు.
ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు నాణ్యత లేని మద్యం ఏపీలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. మద్యం సేవించేవారితో మాన్పించడం సాధ్యం కాకపోయినప్పటికీ…తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యత మద్యం లేకుండా చేస్తే కొంత వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు.
గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందని అన్నారు. నాటి మద్యం ధరలు భరించలేక చాలా మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారని అన్నారు. ఇష్టారీతిన పెంచిన ధరలు పేదల జీవితాలను మరింత నాశనం చేశాయని…ఆ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
తమకు వచ్చిన ఆదాయాన్నంతా పేదలు మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల వారి కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. రేట్లు పెంచి పేదవాడిని దోచుకున్న విధానానికి స్వస్తి పలకాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సమగ్ర అధ్యయనం తరువాత కొత్త మద్యం విధానం రూపొందించాలని ఆదేశించారు. దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్త మద్యం విధానంపై వచ్చే ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చిస్తామన్నారు.
పొరుగు రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గంజాయి విషయంలో కూడా ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మద్యం విధానం ఆదాయం కోణంలో కాకుండా….అవకతవకలకు అవకాశం లేని విధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
అక్టోబరు ఒకటో తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేసేందుకు ఎక్సైజ్ అధికారులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఆయా నివేదికలపై కేబినెట్ చర్చించాక ఈ నెలాఖరులోగా కొత్త మద్యం విధానం సిద్ధం చేయనున్నారు. సెప్టెంబరులో అమలుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది. అక్టోబరు ఒకటి నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష
రాష్ట్ర రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్ధ్యాన్ని మెరుగు పరచడంతో పాటు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
డిమాండుకు తగ్గ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి వంటి పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందని, ఆ దిశగా ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, యూనిట్ విద్యుత్ తయారీకి అవుతున్న వ్యయం, లోటును భర్తీ చేసేందుకు ఇతర గ్రిడ్ల నుండి కొనుగోలు చేస్తున్నవిద్యుత్ కు అవుతున్న వ్యయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అదే విధంగా థర్మల్, జల విద్యుత్, సోలార్, విండ్ వంటి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితులపైనా సమీక్షించారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానంపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్