Best Web Hosting Provider In India 2024
Nelakondapalli Buddha Stupa : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ పటంలో చోటు కల్పించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలోని బౌద్ధ స్థూపాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిలతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలకు విశేషంగా ప్రాచుర్యం కల్పించి ప్రపంచ పటంలో తెలంగాణను నిలపడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ బౌద్ధ స్తూపం దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధస్తూపమని తెలిపారు. నిధుల కొరత లేదని, ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రచారకులను ఆహ్వానించాలని, మన బౌద్ధ పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పటంలో నిలపాలని పేర్కొన్నారు. బౌద్ధుల పండుగలు చూసి నేలకొండపల్లిలో ఉత్సవాలు నిర్వహించాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధ ప్రచారకులను ఈ ఉత్సవాలకు ఆహ్వానించాలని ఆయన అన్నారు.
రూ.10 కోట్లు మంజూరు
ఇప్పటికే రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేశామని భట్టి చెప్పారు. పనులు ప్రారంభించాలని, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం కనిపించే పురాతన ఆనవాళ్లను కాపాడుకుంటూ, మరుగున పడిపోయిన ఆనవాళ్లు సైతం వెలికితీసి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. రోడ్డు వ్యవస్థను మెరుగు పర్చాలని, సమగ్ర ప్రణాళిక చేసి, బౌద్ధులను భాగస్వామ్యం చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
దక్షిణ భారతదేశంలో అతి పెద్దది
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… ఈ బౌద్ధ స్తూపం 1వ శతాబ్దం నాటిదని, దక్షిణ భారతదేశంలో అతి పెద్దదని అన్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్థూపం ఉందని, దీనిని అభివృద్ధి చేస్తే, గొప్ప పర్యాటక ప్రాంతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ బుద్దిస్ట్ మ్యూజియం ఏర్పాటు చేయాలని, అభివృద్ధికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ తయారు చేయాలని అన్నారు. అండర్ గ్రౌండ్లో ఆనాటికి సంబంధించిన శిలలు ఉన్నాయని ఆయన తెలిపారు. సహజ సిద్ధమైన జీవకళ ఉండి, అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపాన్ని దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చాలని అన్నారు. అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. నేలకొండపల్లి భక్త రామదాసు జన్మించిన స్థలమని, మ్యూజియంగా భక్త రామదాసు మందిరం అభివృద్ధి చేయాలని, టూరిస్ట్ లను ఆకర్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో రిజర్వాయర్ ఉందని, పాలేరు రిజర్వాయిర్, భక్త రామదాసు, బౌద్ద స్తూపాలను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
టూరిజం అభివృద్ధికి పెద్ద పీట
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. బయటి దేశాల నుంచి బౌద్ధులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి నెలలో మంత్రులు, శాసన సభ్యులు ఒకరోజు ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లేలా కార్యాచరణ చేయాలన్నారు. దీంతో పర్యాటకంపై ప్రచారం కలిగి, ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు. పర్యాటక ప్రాంతాల సందర్శనతో ఆలోచన విధానం మారుతుందన్నారు. బౌద్ధస్తూపం, భక్త రామదాసు ఇల్లు దగ్గర అభివృద్ధి పనులు, నీటి వనరుల్లో బోటింగ్, టాయిలెట్లు, హోటల్ తదితర ఏమేం పనులు చేపట్టాలో సమగ్ర నివేదిక పొందుపర్చి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలాగా అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి అన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలతో కలిసి భక్త రామదాసు గృహాన్ని సందర్శించారు. తెలుగు వాగ్గేయకార ఆద్యులు, భద్రాచల శ్రీ సీతారామ దేవస్థానం నిర్మించిన భక్త రామదాసు (కంచర్ల గోపన్న) నాలుగు శతాబ్దాల కిందట జీవించిన నేలకొండపల్లిలోని ఆయన స్వగృహాన్ని, పక్కనే నిర్మాణంలో ఉన్న నూతన ధ్యాన మందిరాన్ని వారు సందర్శించారు. భక్త రామదాసు వినియోగించిన బావిని పరిశీలించారు. అప్పటి విశేషాలను అర్చకులు, స్థానికుల ద్వారా తెలుసుకున్నారు.
రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం
టాపిక్