Best Web Hosting Provider In India 2024
సచివాలయ వ్యవస్థ పైలాన్‌పై లోగో కూడా మాయం
జనసేన నాయకుల నిర్వాకం
కాకినాడ: పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆ ఏడాది అక్టోబర్ నెల 2 గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను కరప నుంచి ఆయన లాంఛనంగా ప్రారంభించి, పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరప గ్రామసచివాలయం–1 వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌కు నీలం, తెలపు, ఆకుపచ్చ రంగులు వేసి, పైభాగంలో నాలుగుపక్కలా నవరత్నాల చక్రం లోగోలోవైయస్ జగన్ ముఖచిత్రం ఉండేలా విద్యుద్దీపాలతో గ్రామసర్పంచ్ సాదే ఆశాజ్యోతి ఏర్పాటు చేశారు.
కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోటీచేసిన పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆ పార్టీ మండల నాయకులు పైలాన్‌ను తొలగించాలని చూడగా గ్రామ కార్యదర్శి ఎస్‌కే నాగేంద్రకుమార్ జీఓ లేకుండా పైలాన్ తొలగించడానికి వీలులేదని చెప్పారు. తర్వాత నాగేంద్రకుమార్‌కు గ్రేడ్–1 కార్యదర్శిగా పదోన్నతి రాగా, బదిలీపై వెళ్లారు.
తర్వాత మళ్లీ జేఎస్‌పీ నాయకులు పైలాన్‌పై ఉండే జగన్ చిత్రాన్ని తొలగించాలని పట్టుబట్టి తొలగించారు. పైలాన్ పైభాగంలో నాలుగుసింహాల బొమ్మను ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. వైయస్ఆర్‌సీపీ జెండా రంగులు తొలగించి టీడీపీ, జనసేన రంగులు వేస్తే ఊరుకోబోమని, జాతీయజెండా రంగులు వేస్తే అభ్యంతరం లేదని, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పేరుతో ఉన్న శిలాఫలకం తొలగించినా అంగీకరించమని సర్పంచ్ ఆశాజ్యోతి తెలిపారు. పనులు పూర్తయ్యాక, రంగులు ఏమి వేస్తారో వేచి చూస్తామని వైయస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు.