Hanmakonda Suicides: వరుసకు చెల్లి అయ్యే యువతితో వివాహితుడి ప్రేమ వ్యవహారం.. ఇద్దరు కలిసి ఆత్మహత్య

Best Web Hosting Provider In India 2024


Hanmakonda Suicides: పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఓ యువకుడు వరుసకు చెల్లి అయ్యే యువతితో ప్రేమాయణం మొదలు పెట్టాడు. విషయం ఇంట్లో తెలిసి తండ్రి మందలించడంతో ఇద్దరూ కలిసి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు.

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం పైడిపల్లి గ్రామం మధ్య గూడెం ప్రాంతానికి చెందిన సంగాల దిలీప్(30) వరంగల్ హంటర్ రోడ్డు సమీపంలోని టైల్స్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. కాగా కొంత కాలం కిందట దిలీప్ కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బంజర పల్లి గ్రామానికి చెందిన శిరీషతో వివాహం జరిగింది.

వారి సంసార జీవితానికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ పెళ్లికి ముందు నుంచే దిలీప్ తమ స్వగ్రామం పైడిపల్లిలో తనకు వరుసకు చెల్లి అయ్యే తిక్క అంజలి(25)తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఆమె నర్సింగ్ చేస్తుండగా.. ఇద్దరు గుట్టుగా ప్రేమ వ్యవహారం కొనసాగించారు.

విషయం తెలిసి మందలించిన తండ్రి

దిలీప్, అంజలి ప్రేమించుకుంటున్న సంగతి గ్రామంలో తెలిసింది. పెళ్లికి ముందు నుంచే ఇద్దరు మధ్య లవ్ అఫైర్ నడుస్తున్నప్పటికీ దిలీప్ కు వివాహం జరిగిన తరువాత వెలుగులోకి వచ్చింది. అప్పటికే దిలీప్ శిరీష దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టగా.. దిలీప్ వ్యవహారం మారకపోవడం, విషయం తెలిసి భర్తను నిలదీసినా ఫలితం లేకపోవడంతో శిరీష కొద్ది రోజుల కిందట తన తల్లి గారి ఇల్లయిన బంజరు పల్లి గ్రామానికి వెళ్లి అక్కడే ఉంటోంది.

ఇదిలా ఉంటే పెళ్లి చేసుకుని పిల్లలను కన్న తరువాత కూడా దిలీప్ తీరు మార్చుకోకపోవడం, గ్రామంలో చెల్లి వరుస అయ్యే అంజలితో ఇప్పటికీ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుండటంతో దిలీప్ తండ్రి గణపతి అతడిని నిలదీశాడు. గ్రామంలో పరువు పోతోందని, తీరు మార్చుకోవాలని చెప్పాడు. దీంతో దిలీప్ మనస్తాపానికి గురయ్యాడు.

చెరువులో దూకి సూసైడ్

ఓ వైపు తండ్రి మందలించడం, మరో వైపు ప్రేమించిన యువతిని మరిచిపోలేక దిలీప్ తీవ్ర వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన దిలీప్ బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాక పోవడంతో ఎక్కడికో వెళ్లి ఉంటాడని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ దిలీప్, అంజలి ఇద్దరూ కలిసి ఆదివారం వరంగల్ జిల్లా రా యపర్తిలోని రామచంద్రుని చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే రాయపర్తి మండలంలోని రామ చంద్రుని చెరువులో గుర్తు తెలియని మృత దేహం కనిపించినట్టుగా సోమవారం సాయంత్రం స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ సురేశ్, ఎస్సై ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

చెరువు గట్టున పార్క్ చేసి ఉన్న బైక్, అక్కడ లభించిన యువతి బ్యాగ్, అందులో ఉన్న ఆధార్ కార్డులు, సెల్ ఫోన్ ల ఆధారంగా మృతులు సంగాల దిలీప్, తిక్క అంజలి గా గుర్తించారు. అనంతరం పైడిపల్లి గ్రామంలోని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం చేర వేశారు. కాగా ఇద్దరి మృతితో పైడిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి)

టాపిక్

Crime NewsCrime TelanganaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024