Best Web Hosting Provider In India 2024
తలగడను తలకిందులుగా, ఎన్నో రకాలుగా వాడేవాళ్లుంటారు. ఆప్యాయంగా తలగడను కౌగిలించుకుని పడుకునేవాళ్లుంటారు. కాళ్ల మధ్యలో నొక్కి పెట్టి పడుకునే వాళ్లు మరికొందరు. ఇలా ఎన్నో రకాలుగా తలగడను వాడేస్తారు. ఇక ప్రతి ఇంట్లోనూ రెండు రకాల మనుషులుంటారు. ఒకరికి తలగడ లేకపోతే కళ్లు అంటుకోవు. మరికొందరకి తలగడ ఉంటే నెత్తికింది బండ పెట్టుకున్నట్లుంటుంది. సరే.. రకాలేమైనా ఇంతకీ తలగడ వాడితే మంచిదా కాదా అని తెల్సుకుందాం. ఎవరి అలవాటు మంచిదో తేలిపోతుంది.
కొందరికి మేలు:
చదునుగా ఉన్న పరుపు మీద ఎత్తుగా ఉండే తలగడ ఉండేది ఊరికే కాదు. తలకింద దిండు పెట్టుకోవడం వల్ల వెన్నెముక, తల సమాంతరంగా ఉంటాయి. దానివల్ల మెడలో నొప్పి వచ్చే అవకాశాలుండవు. అయితే కొందరికి మాత్రం తలగడ లేకుండా నిద్రపోతేనే మేలు. పూర్తిగా చదివి దీని లాభ నష్టాలు బేరీజు వేసుకుని మీ అలవాటు కొనసాగించండి.
తలగడ లేకుండా నిద్రిస్తే ఇబ్బందులివే:
1. వెన్నెముక స్థితి:
బోర్లా పడుకునే వాళ్లు తలగడ వాడకపోతే ఎంత మంచిదో, వెళ్లకిలా, పక్కకు తిరిగి పడుకునే వాళ్లు తలగడ వాడటం అంత మంచిది. లేదంటే వెన్నెముక సమాంతరంగా ఉండదు. ఇక పక్కకు తిరిగి పడుకున్నప్పుడు మెడకు , భుజానికి మధ్య ఎడం ఉంటుంది. ఆ ఎడాన్ని తలగడ లేకుండా చేస్తుంది. లేదంటే మెడ పూర్తిగా వంగిపోయినట్లే ఉంటుంది. ఇది సరైన స్థితి కాదు. కాబట్టి తప్పకుండా తలగడ వాడాలి.
2. వెన్ను నొప్పి తగ్గుతుంది:
తలగడ లేకుండా నిద్రపోవడం వల్ల వెన్నెముక స్థతి సరిగ్గా లేక నడుము నొప్పి వస్తుంది. అందుకే బెడ్ మీది నుంచి లేవగానే వెనకాల పట్టేసినట్లుగా అనిపిస్తుంటుంది. ఆ ఇబ్బంది ఉన్నవాళ్లు తప్పకుండా దిండు వాడటం మంచిది.
3. మెడ నొప్పి:
మెడ, భుజాల నొప్పి రాకుండా ఉండటానికి నిద్ర భంగిమ సరిగ్గా ఉండాలి. దిండు లేకుండా పడుకుంటే మెడ పట్టేసే అవకాశం ఎక్కువ. మెడ నొప్పితో పాటే ఒత్తిడి వల్ల తలనొప్పి కూడా రావచ్చు.
4. భుజాల నొప్పి:
దిండు లేకుండా నిద్రపోయే చాలా మంది తలకింద చేయి పెట్టుకుని పడుకుంటారు. దానివల్ల భుజాల్లో నొప్పి రావడంతో పాటూ చేతుల్లోను తిమ్మిరి వచ్చినట్లుంటుంది. ఈ సమస్య ప్రతిరోజూ వేదిస్తుంటే వెంటనే తలగడ వాడటం మొదలుపెట్టాలి.
5. అసిడిటీ, స్లీప్ ఆప్నియా:
తలగడ లేకుండా నిద్రిస్తే సమాంతరంగా పడుకుంటాం. అంటే తల, మిగతా శరీరంలో ఒకే గీత గీసినట్లుంటాయి. తల ఎత్తులో ఉండదు. దీనివల్ల కొందరిలో నిద్రలోకి జారుకోగానే నాలుక వెనక్కి పడిపోతుందట. దీంతో స్లీప్ ఆప్నియా అనే సమస్య మొదలవుతుంది. అంతే కాక కడుపులో ఉన్న ఆమ్లాలు గొంతులోకి రావడం సులువవుతుంది. కాబట్టి తల కాస్త పైకి ఉంటే ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.
6. వైద్యులను సంప్రదించాలి:
వెన్నెముకకు సంబంధించిన సమస్యలున్న వాళ్లు ముఖ్యంగా తలగడ లేకుండా నిద్రపోవడం మంచిది కాదు. అందుకే ఇలాంటి మార్పులు చేసుకునే ముందు ఒకసారి వైద్య సలహా తీసుకోవడం మరింత ఉత్తమం.
దిండు లేకుండా నిద్రించడం వల్ల లాభాలు:
1. కొంతమందికి బోర్లాపడుకునే అలవాటుంటుంది. అంటే.. బరువంతా పొట్టమీద వేసి పడుకుంటారు. ఇలా పండుకోవడం నిజానికి మంచి అలవాటు కాదు. ఇలా పడుకున్నప్పుడు తలకింద దిండుంటే మీరు పడుకునే స్థితి మరింత దెబ్బతింటుంది. వంకరగా, నడుము భాగం కిందికి పోతుంది. వెన్నెముక స్థితి సరిగ్గా ఉండదు. కాబట్టి బోర్లా పడుకునే వాళ్లు తలగడ వాడకపోవడం మంచిది.
2. తలగడ వాడటం వల్ల జుట్టు పొడిబారీ నిర్జీవంగా మారుతుంది. తలలోని సహజ నూనెలు పీల్చుకోవడమే దానికి కారణం. బదులుగా కాటన్ పిల్లో కవర్ బదులు సిల్క్ పిల్లో కవర్ వాడితే ఈ సమస్య తగ్గుతుంది.
3. వయసు ఎక్కువున్న వాళ్లలో ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తలగడలో పేరుకుపోయి ఉన్న మృతకణాలు, దుమ్ము వల్ల తుమ్ములు, ఎలర్జీ రియాక్షన్లు, కళ్ల దురద లాంటి ఇన్ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా తలగడను, తలదిండు కవర్ ను శుభ్రం చేస్తేనే తలగడ వాడాలి.
టాపిక్