Best Web Hosting Provider In India 2024
అంగస్తంభన అనేది పురుషుల్లో చాలా మందిని ప్రభావితం చేస్తోన్న లైంగిక రుగ్మత. ఈ మధ్య యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల శృంగార జీవితంలో సంతృప్తి లేక ఆ ప్రభావం వివాహ బంధం మీదా పడుతోంది. దాంతో నిరాశ, డిప్రెషన్ లాంటి సమస్యలు చుట్టు ముట్టేస్తున్నాయి.
అంగస్తంభన సమస్య ఉన్న వాళ్లు శృంగారానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సమస్య బయటకు చెప్పుకోక క్రమంగా భాగస్వామికి దూరమైపోతారు. బంధంలో క్రమంగా ప్రేమ కొరవడుతుంది. దాంతో ఒంటరితనం వాళ్ల చెంత చేరుతుంది. ఎవరికీ చెప్పుకోలేని బాధతో క్రమంగా డిప్రెషన్ లోకీ వెళ్లిపోతారు.
అంగస్తంభనకు కారణాలు:
మెదడు, హార్మోన్లు, భావోద్వేగాలు, నరాల పనితీరు, కండరాలు, రక్త కణాలు.. ఇవన్నీ పురుషుల్లో శృంగారం వాంచ మీద ప్రభావం చూపే అంశాలు. వీటిలో ఏ సమస్య ఉన్నా అంగస్తంభన సమస్య రావచ్చు. తీవ్రమైన ఒత్తిడి, నిద్ర లేమి కూడా దీనికి కారణమే.
అంగస్తంభన శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యల్ని సూచిస్తుంది. డయాబెటిస్, హఐపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులకు దీర్ఘకాలికంగా ఏ చికిత్సా తీసుకోకపోతే దాని వల్ల ఈ సమస్య రావచ్చు. అలాగే అధిక బరువు, పోషకాలు లేని ఆహారం, వ్యాయామం లేని జీవనశైలి కూడా అంగస్తంభన సమస్యకు కారణాలే.
సమస్య సహజంగా తగ్గించుకునే మార్గాలు:
1. ఆహారం:
పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం మీద ప్రభావం ఉంటుంది. దీంతో క్రమంగా అంగస్తంభన సమస్యా తగ్గొచ్చు. ముఖ్యంగా ఎరుపు రంగు మాంసానికి దూరంగా ఉండటం మంచిది. పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలి.
2. వ్యాయామం:
శరీరాన్ని కదిలించకుండా ఉంటే దాని ప్రభావం కూడా అనేక రకాలుగా ఉంటుంది. తరచూ వ్యాయామాలు చేయడం, అధిక బరువు, గుండె సంబంధిత వ్యాధులు కూడా అంగస్తంభనకు కారణం. అందుకే రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయాలి. సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఏదైనా చేయొచ్చు.
3. నిద్ర:
నాణ్యమైన నిద్ర అంగస్తంభన సమస్యను తగ్గించడంలో పాత్ర పోషిస్తుంది. నిద్ర లేకుండా పని చేసే వాళ్లలో ఈ సమస్య ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గిపోతాయి. దీంతో సమస్య ఎక్కువవ్వొచ్చు.
4. ఆల్కహాల్, స్మోకింగ్:
ఆల్కహాల్, దూమపానం లాంటి దుర్వసనాల ప్రభావం అంగస్తంభనకు కారణం కావచ్చు. ఈ సమస్యతో ఇబ్బంది పడేవాళ్లు వీటికి దూరంగా ఉండటం మంచిది. అనారోగ్యానికి కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
ఈ మార్పులతో కూడా సమస్యకు ఫలితం లేకపోతే వెంటనే వైద్యులని సంప్రదించాలి. దానికి తగిన చికిత్సతో మెరుగైన ఫలితాలుంటాయి.
అంగస్తంభన అనేది యువతలో పెరుగుతున్న సమస్య. ఇది వారిని అనేక విధాలుగా బాధపెడుతోంది. కాబట్టి, పురుషులు అంగస్తంభనకు ప్రమాద కారకాల గురించి తెలుసుకోవడం, దానిని నివారించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని పెద్ద సమస్యగా మారకుండా నిరోధించడం కోసం ప్రారంభంలోనే చికిత్స పొందడం కీలకం. సరైన చికిత్సతో ఈ సమస్యను అధిగమించవచ్చు. లైంగిక సామర్థ్యాన్ని తిరిగి పొందవచ్చు. దీనివల్ల మొత్తం జీవన నాణ్యత పెరుగుతుంది.