Crop Loan Waiver : రైతు రుణమాఫీలో నిబంధనల కిరికిరి- చిన్న తప్పిదాలతో వేలాది మంది రైతుల అనర్హత

Best Web Hosting Provider In India 2024


Crop Loan Waiver : రైతు రుణ మాఫీ వ్యవహారం చివరకు రాజకీయ రంగు పులుముకుంటోంది. మూడు విడతల్లో మాఫీ చేసిన రుణ మొత్తం, లబ్ధి పొందిన రైతు కుటుంబాల సంఖ్యపై నిరసన వ్యక్తమవుతోంది. చిన్న చిన్న తప్పిదాలకే వేలాది మంది రైతులు రుణమాఫీని పొందలేకపోయారు. దీంతో వీరి సమస్యలను పరిష్కరించి రుణమాఫీ అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండల వ్యవసాయ శాఖ అధికారులను (ఏఓ) నోడల్ అధికారులుగా నియమించింది.

రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.లక్ష, రూ.లక్షన్నర, రూ. రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. అయితే, ఈ మూడు విడతల్లోనూ చాలా మంది రైతులు వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీకి అనర్హులు అయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రుణ మాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పిందని ఎదురుదాడికి దిగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కన్నా ఈసారి రుణమాఫీలో లబ్ధిపొందిన రైతులు, ప్రభుత్వం చెల్లించిన మొత్తంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ గణాంకాలను ముందు పెట్టుకుని బీఆర్ఎస్ విమర్శలకు దిగడం, కాంగ్రెస్ నాయకత్వం ప్రతివిమర్శలు చేయడంతో రుణమాఫీ వ్యవహారం రాజకీయ టర్న్ తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చిన్న చిన్న కారణాలకు అనర్హత

రుణ మాఫీకి ప్రభుత్వం ఒక కటాఫ్ డేట్ నిర్ణయించింది. 2018 డిసెంబరు 12వ తేదీ నుంచి 2023 డిసెంబరు 9వ తేదీల మధ్య రుణాలు తీసుకున్న రైతులు రుణమాఫీకి అర్హులు అవుతారు. ఒక రైతు కుటుంబంలో ఎన్ని ఖాతాలు ఉన్నా(రేషన్ కార్డు ఆధారంగా) ఒకరికే రుణమాఫీ వర్తిస్తుంది. అదీ అసలు, వడ్డీ సహా రూ.2 లక్షల వరకే. అంతకు మించి రుణం ఉన్నా, తీసుకున్న రుణం వడ్డీ ఎక్కువగా ఉన్నా రైతులే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సంవత్సరాలుగా రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ఇచ్చినా, కొత్తగా ఏర్పాటైన కుటుంబాలకు అందలేదు. అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డ్ నిబంధన తప్పనిసరి కాదని ప్రభుత్వం ఆ తర్వాత ప్రకటించినా అధికారులు మాత్రం తప్పనిసరి అంటున్నారు. దీంతో మౌఖింగా వారికి ఆదేశాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

బ్యాంకర్లు చేసిన తప్పిదాలకూ రైతులు మూల్యం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం విధించిన కటాఫ్ డేట్ 2018 డిసెంబరు 12కు ముందు రుణాలు తీసుకున్న రైతులు ఆ తర్వాత ఏటా రుణాన్ని రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. రెన్యువల్ చేసిన తేదీ నుంచి దానికి కొత్త రుణంగానే పరిగణించాలి. సదరు రుణానికి సంబంధించి కొత్త ఖాతా నెంబర్ ఉంటుంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకర్లు, 2018 డిసెంబరు 12కు ముందు తీసుకున్న రైతుల రుణాలను వారు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నా.. కొత్త తేదీలు ఇవ్వకపోవడంతో వారంతా పాత జాబితాలోనే మిగిలిపోయి, ప్రభుత్వం చేసిన రుణమాఫీకి అర్హత పొందలేకపోయారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది రైతులు అనర్హులు అయ్యారు.

పేర్లలో తేడాలు

బ్యాంకు ఖాతాలోని పేరుతో, ఆధార్ కార్డులోని పేరు వ్యత్యాసం ఉన్నా రుణమాఫీ జరగలేదు. ఇవి సాంకేతిక సమస్యలే అయినా, ఆన్ లైన్ లో వీరి వివరాలే కనిపించడం లేదు. అదే మాదిరిగా రైతు పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతాలో పేరులో అక్షరం తేడా ఉన్నా రుణమాఫీ జాబితాలో పేరు లేకుండా పోయింది. ఆధార్ లోని పేరు, రుణ ఖాతాలోని పేరు వేరుగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులు నిర్ధారణ చేయాల్సిన వారి పేర్లనూ పెండింగ్ లో పెట్టారు. రైతు కుంటుంబంలో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, సర్వీసు పెన్షన్ పొందుతున్న వారున్నా పెండింగ్ లో పెట్టారు.

రైతుకు పాసు పుస్తకం లేక పోవడం, రుణమాఫీ కటాఫ్ డేట్ మధ్యలోనే రుణం తీసుకుని ఉన్నా, అవసరాల రీత్యా భూమిని అమ్ముకున్న రైతుల నుంచి కొనుగోలు చేసిన రైతుకు భూమి బదిలీ కావడం, దీంతో పాసు పుసక్తం రద్దు కావడం వల్ల కూడా మాఫీ జాబితాలో పేర్లు రాలేదు. పంట రుణం తీసుకున్న రైతు ఒక వేళ మరణిస్తే, భూమి వారసుల పేరు మీదకు మారిపోయింది. కానీ రుణం అలాగే ఉండిపోయింది. ఇలాంటి వారి కేసులకూ రుణమాఫీ వర్తించలేదు. తీసుకున్న పంట రుణం కంటే, వడ్డీ ఎక్కువగా ఉన్న రైతులకూ రుణ మాఫీ జాబితాలో చోటు దక్కలేదు.

రెన్యువల్ రుణాలకు పాత తేదీలు

రుణం మంజూరైన తేదీ, నిబంధనల ప్రకారం లేకపోవడం కూడా కారణంగా ఉంది. అంటే రైతులు రుణాలపై వడ్డీలు చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకున్నా పాత తేదీని మార్చి కొత్త తేదీ ఇవ్వకపోవడం వల్ల వందలాది మంది రైతులు నష్టపోతున్నారు. అటు ఆధార్ కార్డులో తప్పులు, బ్యాంకు ఖాతాల్లో తప్పులు, పట్టా పాసు పుస్తకాల్లో తప్పులు, ఒక వ్యక్తి ఖాతా ఐడీ వేరే వ్యక్తీకి ఇవ్వడం, ఒకే ఖాతాకు ఇద్దరి పేర్లు ఉండడం ఉండడం వంటి సాంకేతిక తప్పిదాల వల్ల మూడు విడతల్లోనూ రుణ మాఫీ కానీ రైతుల సంఖ్య వేలల్లో ఉంది.

రుణమాఫీపై వస్తున్న వివిధ ఫిర్యాదులను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మండల వ్యవసాయ అధికారులను నోడల్ అధికారులుగా నియమించి, తప్పులను సరిదద్దే బాధ్యతను అప్పజెప్పింది. కాగా, మూడో విడతలో నల్గొండ జిల్లాలో 36,398 మంది రైతులకు రుణమాఫీగా రూ.455.026 కోట్లు విడుదల అయ్యాయి. రుణ మాఫీ జాబితాలో చోటు దక్కని మూడు విడతల్లోని రైతుల నుంచి శనివారం నాటికి వ్యవసాయ శాఖకు 13 వేల పైచిలుకు ఫిర్యాదులు అందాయి.

(రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )

సంబంధిత కథనం

టాపిక్

Crop LoansFarmersTelangana NewsAgricultureTrending TelanganaTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024